జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన 23.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన 23.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం పోలీసు సమావేశ మందిరంలో ఎస్పీ అన్బురాజన్ ఆ కేసుల వివరాలను వెల్లడించారు. నిందితులను అనంతపురం రూరల్, పుట్లూరు, గుంతకల్లు వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు పాత నేరస్తులు.
కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన పీట్ల గంగాధర్ అలియాస్ సాంబను అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 50కి పైగా చోరీ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి నగరంలోని వివేకానందనగర్ , సిండికేట్ నగర్ లలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పగటి చోరీలకు పాల్పడ్డారు.
ముందు రోజు రెక్కీ నిర్వహించి మరుసటి రోజు ఇళ్లలో చోరీ చేయడం అలవాటు. అనంతపురం కేసుల్లో ఆరు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపగా, ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు.
నార్పల మండల కేంద్రానికి చెందిన బస్సే సుభాష్ పుట్లూరు పోలీసులకు దొరికిపోయాడు. వ్యసనాలు, జల్సాల కోసం సులువుగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు చేసేవాడు. తాడిపత్రి రూరల్ , అర్బన్ పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు ఉన్నాయి. వీటితో పాటు తాజాగా మరో ఐదు చోరీలకు పాల్పడ్డాడు.
ఈ ఏడాది ఆగస్టులో బుక్కరాయసముద్రం మండలం బి.కొత్తపల్లి, తాడిపత్రి రూరల్ మండలం చిన్నపొలమడ, యల్లనూరు, పుట్లూరు మండలం గోపరాజుపల్లిలో చోరీలకు పాల్పడ్డాడు. అతడి నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
గుంతకల్లు టౌన్ రాజేంద్ర నగర్ కు చెందిన పవన్ బహదూర్ ను గుంతకల్లు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఆరున్నర తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు బండారు విజయ్‌కుమార్‌తో కలిసి గుంతకల్లు రైల్వే క్వార్టర్స్‌లో చోరీకి పాల్పడ్డాడు.
ఇతనిపై ఇప్పటికే గుంతకల్లు వన్‌టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్లలో రెండు చోరీలకు పాల్పడ్డాడు. విలేకరుల సమావేశంలో అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి, సీఐ రామసుబ్బయ్య, ఎస్సైలు ప్రవీణ్ కుమార్, దిలీప్ కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఎస్పీ అన్బురాజన్ సిబ్బందికి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.
Discussion about this post