ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,86,389 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ (AP Budget 2024)ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3.51 శాతం మేర ద్రవ్యలోటు, 1.56 శాతం రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించినా ఏప్రిల్ నుంచి జులై నెలల వరకే ఆమోదం తీసుకుంటారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎన్నికల తర్వాత కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
2,05,352 కోట్లు రెవెన్యూ రాబడిని బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర పన్నుల ద్వారా రూ.49,286 కోట్లు, రాష్ట్ర పన్నుల ద్వారా రూ.1,09,538 కోట్లు వస్తుందని పేర్కొంది. పన్నేతర ఆదాయంగా రూ.14,400 కోట్లు, గ్రాంట్ ఇన్‌ఎయిడ్ ద్వారా రూ.32,127 కోట్లు వస్తుందని పేర్కొంది. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి పాత, మూస పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంబించామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి బుగ్గన తెలిపారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టామన్నారు.
source : eenadu.net
Discussion about this post