రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వైకాపా నాయకులు దౌర్జన్యాలు, బరితెగింపులకు పాల్పడితే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత సూచించారు. నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ప్రచారం నిర్వహిస్తే కచ్చితంగా అనుమతి తీసుకోవాలన్నారు. గురువారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో తెదేపా కన్వీనర్లు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అధికార పార్టీ నాయకులు చేసే ప్రచార కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అధికారులు, ఉద్యోగులు ఎవరైనా సరే వైకాపా నాయకుల తరఫున ప్రచారంలో పాల్గొంటే వీడియోలు తీసి ఎన్నికల అధికారులకు పంపాలన్నారు. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, ఎక్కడైనా వాలంటీర్లు పాల్గొంటే ఫొటో ఆధారాలతో సీ-విజిల్ యాప్‌లో ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతి గంట విలువైందని, ఎవరూ నిర్లక్ష్యంగా ఉండవద్దని స్పష్టం చేశారు.
source : eenadu.net
Discussion about this post