‘ఎన్నికల షెడ్యూలు విడుదల కాగానే మీ పరిధిలో రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడమేంటి? వాటిని ఎందుకు నియంత్రించలేకపోయారు? రాజకీయ హత్యలకు పాల్పడేంతలా పరిస్థితులు దిగజారిపోతుంటే మీరెందుకు ఉదాసీనంగా వ్యవహరించారు? శాంతిభద్రతల పరిరక్షణలో ఈ నిర్లక్ష్యం ఏంటి?’’ అని ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ హింసకు ఆస్కారమివ్వకుండా ఈ ఎన్నికలు నిర్వహించాలని పదే పదే ఆదేశిస్తున్నా… ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో తెదేపా నాయకుడు మునయ్య, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెదేపా సానుభూతిపరుడు ఇమాం హుస్సేన్ హత్యలు, పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా కార్యకర్త ఇర్ల సురేష్ కారు దహనం ఘటనలపై వివరణ ఇచ్చేందుకు ఈ ముగ్గురు ఎస్పీలు గురువారం సాయంత్రం ముకేశ్‌కుమార్ మీనా ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. వీరి ముగ్గుర్ని ప్రశ్నించినప్పుడు శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ శంఖబ్రత బాగ్చీ కూడా వారితోపాటు ఉన్నారు. ఒక్కొక్కరిని సీఈఓ 15-20 నిమిషాలు ప్రశ్నించారు. ఆయా ఘటనల్లో రాజకీయ కోణమేంటి, ఇప్పటివరకూ వాటిపై ఏం చర్యలు తీసుకున్నారనే అంశాలపై అడిగారు. వారిచ్చిన సమాధానాలు, సమర్పించిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు పంపించనున్నట్లు ముకేశ్‌కుమార్ మీనా మీడియాకు వెల్లడించారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన తెదేపా నాయకుడు పాముల మునయ్య (37)ది రాజకీయ హత్యేనని ఆ జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి సీఈఓ ఎదుట అంగీకరించారు. నిందితులు వైకాపా వారేనని నివేదించారు. ఈ హత్యకు దారితీసిన పరిస్థితుల్ని ఆయన వివరించారు. నిందితులందర్నీ వెంటనే అరెస్టు చేశామని తెలిపారు. ‘ప్రజాగళం’ సభకు పెద్దసంఖ్యలో గ్రామస్థుల్ని తీసుకెళ్లారనే కారణంతోనే ఆయన్ను హత్య చేశారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలు, ఫిర్యాదులపై ఎస్పీని సీఈఓ ప్రశ్నించారు. ముందుజాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారని నిలదీశారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రిలో తెదేపా సానుభూతిపరుడు ఇమాం హుస్సేన్ హత్యకు వ్యక్తిగత, కుటుంబకక్షలే కారణమని ఆ జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి సీఈఓకు నివేదించారు. దీనిలో రాజకీయ కోణం లేదని చెప్పారు. నిందితుల్ని వెంటనే అరెస్టు చేశామన్నారు. ఇమాం హుస్సేన్ హత్య కేసు నిందితులు ఆళ్లగడ్డ వైకాపా ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డికి పూలదండలు వేస్తున్న ఫొటోలు పత్రికల్లో వచ్చాయని, వారిమధ్య ఏం అనుబంధం ఉందని రఘువీరారెడ్డిని సీఈఓ ప్రశ్నించినట్లు తెలిసింది.
‘‘పల్నాడు జిల్లా మాచర్ల అత్యంత సున్నితమైన ప్రాంతమని తెలిసినా అక్కడ ఎందుకు మీరు అప్రమత్తంగా లేరు?’’ అని పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిని సీఈఓ ప్రశ్నించారు. మాచర్లలో ఏ చిన్న ఘటన జరిగినా దాని తీవ్రత పెరిగి పెద్దదై ప్రమాదం ఉంటుంది కదా! అలాంటప్పుడు మీరెందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని నిలదీశారు. మాచర్లలో తెదేపా కార్యకర్త సురేష్ కారు దహనం ఘటనపై వివరాలు అడిగారు. ఇప్పటివరకూ నిందితుల్ని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించగా.. నిందితులు ఎక్కడున్నారో గుర్తించామని, గురువారం రాత్రికి వారిని అరెస్టు చేస్తామని ఆయన సీఈఓకు చెప్పారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిఘా ఉంది… జాగ్రత్త!
‘‘రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి హింసాత్మక ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం నిఘా పెట్టి నివేదికలు తెప్పించుకుంటోంది. ఏపీలో ఏం జరుగుతుందో వారికి తెలుసు. జాగ్రత్త!’’ అని ముగ్గురు ఎస్పీలను ముకేశ్‌కుమార్ మీనా హెచ్చరించారు. వెంటనే అన్ని పార్టీల ప్రతినిధులను పిలిపించి సమావేశాలు ఏర్పాటుచేయాలని సూచించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే తీవ్రమైన చర్యలుంటాయని వారిని హెచ్చరించాలని పేర్కొన్నారు. ఏ చిన్న ఘటన జరిగినా ఎస్పీలనే బాధ్యుల్ని చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఈఓను కలవడానికి ముందు… ఎస్పీలు ముగ్గురూ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ శంఖబ్రత బాగ్చీని కలిసి లిఖితపూర్వక నివేదికలు సమర్పించారు.
source : eenadu.net
Discussion about this post