రాష్ట్ర రాజకీయ చరిత్ర గతినే మార్చేసే కీలక ఘట్టం ఆదివారం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఆవిష్కృతమవుతోంది. వైకాపా కబంధహస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు తెదేపా, జనసేన, భాజపా యుద్ధభేరి మోగించబోతున్నాయి. ఈ మూడు పార్టీలూ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న బహిరంగసభకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోదీ, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పదేళ్ల తర్వాత ఒకే వేదికపైకి వస్తున్నారు. వైకాపాను గద్దె దింపేందుకు ఆ త్రిమూర్తులు శంఖారావం చేయనున్నారు. మూడు పార్టీల మధ్య పొత్తు ఖాయమయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల సభను కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వైకాపా సిద్ధం పేరుతో నిర్వహించిన నాలుగు సభలూ ఒకెత్తు… బొప్పూడిలో తెదేపా, జనసేన, భాజపాలు నిర్వహిస్తున్న ‘ప్రజాగళం’ బహిరంగ సభ మరో ఎత్తు అన్నట్లు విస్తృత ఏర్పాట్లు జరిగాయి. ఈ సభ కోసం తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆధ్వర్యంలో మూడుపార్టీల ముఖ్యనేతలతో ఏర్పాటైన కమిటీలు కొన్ని రోజులుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. ఈ సభకు కనీసం 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సభకు ‘ప్రజాగళం’ అన్న పేరు పెట్టారు.
ప్రధాని సహా ముఖ్యనేతలంతా కూర్చునేందుకు ప్రజాగళం ప్రధాన వేదికను, సాంస్కృతిక కార్యక్రమాలకు మరో చిన్న వేదికను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ఆశీనులయ్యేందుకు ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో పాటు మరో 27 మందికి (పార్టీకి 9మంది చొప్పున) అనుమతిచ్చారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, ప్రజలు ఆదివారం ఉదయం నుంచే తరలిరానున్నారు. సాయంత్రం 5.20 గంటలకు మోదీ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆయన 6.15 గంటల వరకు ఉంటారు. జాతీయ రహదారి పక్కనే పార్కింగ్‌తో కలిపి 300 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేశారు. సభలో కార్యకర్తలు, ప్రజలు కూర్చునేందుకు 24 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సభలో 20 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణాన్ని నేతల కౌటౌట్లు, మూడు పార్టీల జెండాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. జాతీయరహదారికి ఇరువైపులా నేతలు, కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ భారీ ప్లెక్సీలను గణనీయ సంఖ్యలో అభిమానులు ఏర్పాటుచేశారు.
source : eenadu.net
Discussion about this post