ఒకటో తేదీ వస్తూనే మామూలుగా వాలంటీర్ లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛను అందిస్తుంటారు. శుక్రవారం అనంతపురం రూరల్ రుద్రంపేట పంచాయతీ పరిధిలోని పంతులకాలనీ సచివాలయం-2 పరిధిలోని ప్రాంతాల్లో సచివాలయ కన్వీనర్, మార్కెట్ యార్డు డైరెక్టర్ రాజునాయక్, వార్డు సభ్యురాలు సుభద్రమ్మ, వాలంటీరు నాగార్జునతో కలిసి 15 మందికి నిబంధనలకు వ్యతిరేకంగా పింఛను పంపిణీ చేశారు. కాలనీలో వారు పంపిణీ చేస్తోన్న తీరు చూస్తే ఎన్నికల ముందు ఓటర్లుకు డబ్బులు పంపిణీ చేస్తున్నారా అన్నంతగా వ్యవహరిస్తున్నారు. పింఛను దారుల వద్ద నగదు అందిస్తూ వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేస్తే పింఛను మీ ఇంటి వద్దకు వస్తుందని, లేదంటే తెదేపా అధికారంలోకి వస్తే సచివాలయం దగ్గరకు వెళ్లి పింఛను తీసుకోవాలని వృద్ధులను భయపెడుతున్నారు. వాలంటీరు నాగార్జునకు 30 మంది పింఛనుదారులు ఉండగా శుక్రవారం వీరంతా కలిసి 15 మందికి అందించారు. కాలనీ ప్రజలు వీరు పింఛను ఇస్తున్నారా లేక ఎన్నికల్లో ఓట్లకు డబ్బులు పంచుతున్నారా? అన్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు పింఛను పొందే హక్కు ఉంటుంది. దీనిని ఎన్నికల కోసం వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ఇలా వ్యవహరించే వైకాపా సభ్యులపై చట్టపర చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.
source : eenadu.net
Discussion about this post