ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23వ తేదీన ఒంగోలు రానున్నారు. నగరంలోని 22వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నగర శివారు అగ్రహారం వద్ద నిర్వహించనున్న సభ ఏర్పాట్లను సోమవారం మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, కలెక్టర్ దినేష్కుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి తీరుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లోని జగనన్న టౌన్‌షిప్‌లలో అర్హులైన 22వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని వివరించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందని చెప్పారు.
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఆలోచనల మేరకు నగర పరిధిలో అర్హులైన 22 వేల మంది పేదలకు సీఎం చేతుల మీదుగా చేపడుతున్న పట్టాల పంపిణీ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జగనన్న టౌన్‌షిప్‌లను అర్బన్ డెవలప్‌మెంట్ టౌన్‌గా ఏర్పాటు చేయడంతోపాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పింస్తామన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మల్లేశ్వరపురం, అగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాలు భూసేకరణ చేశామన్నారు. పట్టాల పంపిణీ పూర్తి పారదర్శకంగా చేపట్టడంతోపాటు నగరంలోని 70 సచివాలయాల పరిధిలో కన్వేయడ్ డీడ్ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు.
source : sakshi.com
Discussion about this post