‘జగనన్నతోనే విద్యా సాధికారత’ ర్యాలీ విజయవంతం కావడాన్ని టీడీపీతో పాటు ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోయాయని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలతో నీచపు రాతలు ప్రచురించిన ఎల్లో మీడియా ప్రతులను మంగళవారం ధర్మవరంలోని కాలేజీ సర్కిల్‌లో దగ్ధం చేశారు. అనంతరం వైఎస్సార్ విద్యార్థి విభాగ్ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల అమర్‌నాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యా సాధికార ర్యాలీకి వేలాదిమంది విద్యార్థులు తరలిరావడంతో టీడీపీలో నిస్తేజం అలుముకుందన్నారు. ప్రజాదరణలో ముందంజలో ఉన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై బురద జల్లాలని ప్రభుత్వానికి విద్యార్థులు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు వండి వార్చారని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదాలో టీడీపీ నాయకులు ప్రజల సమస్యలపై పోరాడాలే తప్ప ఇలా శిఖండి రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు. ప్రజల్లో విశ్వసనీయత లేని ఎల్లో మీడియాకు త్వరలో బుద్ధి చెబుతామన్నారు.
బహిరంగ చర్చకు సిద్ధమా?
ఎల్లో మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలపై టీడీపీ, బీజేపీ నాయకులు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు సవాల్ విసిరారు. నిరుద్యోగులకు జగనన్న ప్రభుత్వం 1.24లక్షల మందికి సచివాలయాల ద్వారా కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగానికి ఈ నాలుగున్నరేళ్లలో చేసిన రూ.73వేల కోట్ల వ్యయం, చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. అనవసర ఆరోపణలతో ప్రజల్లో చులకన కావొద్దని టీడీపీ, బీజేపీ నాయకులకు హితవు పలికారు.
source : sakshi.com
Discussion about this post