ప్రభుత్వంలో, వివిధ సంస్థల్లో కీలకమైన పోస్టులన్నీ అస్మదీయులకు కట్టబెడుతున్న జగన్ ప్రభుత్వం.. ఎన్నికల ముంగిట మరింత జోరు పెంచింది. ఖాళీగా ఉన్న సమాచార కమిషనర్ల పోస్టులు మూడింటితో పాటు, ఉపలోకాయుక్త పోస్టును భర్తీ చేసేందుకు గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రెండు కమిటీల సమావేశాలు నిర్వహిస్తోంది. సమావేశాలకు రావాలంటూ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు లేఖలు పంపింది. కేవలం ఒకటి రెండు రోజుల ముందు సమాచారం పంపి, సమావేశాలకు పిలవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున గురువారం సమావేశాలకు రాలేనని స్పష్టంచేశారు. కనీసం రెండు వారాల ముందు సమాచారం ఇస్తేనే అర్థవంతమైన చర్చలకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఆయన సాధారణ పరిపాలన శాఖకు బుధవారం లేఖలు పంపారు. ఆ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నవారి బయోడేటాలు పంపిస్తే వారి నేపథ్యం, అర్హతల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
‘‘సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ సమావేశానికి రావాలని ఈ నెల 5న ప్రభుత్వం నోటీసు పంపింది. ఆ లేఖ అదే రోజు నాకు అందింది. కనీసం రెండు వారాల గడువు ఇచ్చి, ఆ తర్వాత సమావేశం జరపాలి’’ అని పేర్కొంటూ సాధారణ పరిపాలన శాఖ (జీపీఎం అండ్ ఏఆర్) ప్రత్యేక ప్రధానకార్యదర్శికి చంద్రబాబు బుధవారం లేఖ రాశారు. ఉపలోకాయుక్త ఎంపిక కమిటీ సమావేశానికి హాజరవ్వాలంటూ మంగళవారం పంపినట్టు ఉన్న నోటీసు తనకు బుధవారం అందిందని తెలిపారు. సమావేశానికి ఒక్కరోజు ముందు వర్తమానం పంపడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. విశ్రాంత జిల్లా న్యాయమూర్తులతో పాటు, హైకోర్టులో కనీసం 25 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉన్న న్యాయవాదులు ఉపలోకాయుక్త పోస్టుకు అర్హులని నిబంధన పెట్టడంపైనా చంద్రబాబు అభ్యంతరం తెలియజేశారు. అది అడ్వకేట్ల చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. ఆ చట్టంలో ‘అడ్వకేట్స్ అండ్ సీనియర్ అడ్వకేట్స్’ అని మాత్రమే పేర్కొన్నారని తెలిపారు. ఉపలోకాయుక్త పోస్టుకు దరఖాస్తు చేసుకున్నవారి బయోడేటాల్ని కూడా తనకు పంపాలని కోరుతూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శికి ఆయన లేఖ రాశారు. ఉపలోకాయుక్త ఎంపిక కమిటీకి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గాను, శాసనసభాపతి, శాసనమండలి ఛైర్మన్, ప్రధాన ప్రతిపక్ష నేత సభ్యులుగాను ఉంటారు.
source : eenadu.net
Discussion about this post