సీఎం జగన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు 15,100 ఉండాలి. శాసనమండలిలో మంత్రి బొత్స చెప్పినదాని ప్రకారం లెక్కించినా మండల, జడ్పీ, పురపాలక పాఠశాలల్లో కలిపి 8,366 పోస్టులు భర్తీ చేయాలి. ప్రభుత్వం మాత్రం అన్నీ కలిపి 6,100 పోస్టులుగా పేర్కొంటూ, ఇదే ‘మెగా డీఎస్సీ’ అంటూ నిరుద్యోగులను మోసగిస్తోంది. గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల బడుల్లోని పోస్టులను కలిపి ఈ లెక్క చెబుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన రెండేళ్ల పదవీ విరమణ వయస్సు గడువు జనవరితో ముగిసింది. తాజాగా ఖాళీ అయ్యే ఆ పోస్టులను విస్మరిస్తోంది.
నాలుగున్నరేళ్ల సమయాన్ని, డబ్బులను వృథా చేసుకున్నామని, పోస్టుల సంఖ్య పెంచకపోతే వైకాపాకు వ్యతిరేకంగా బటన్ నొక్కుతామంటూ నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఖాళీలు 28 వేలకుపైగా ఉండగా, 6 వేల పోస్టులు మాత్రమే నింపాలనుకోవడంపై రగిలిపోతున్నారు. మెగా డీఎస్సీ అని చెప్పి.. మినీ డీఎస్సీ ఇస్తామంటున్న వైకాపా ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామంటున్నారు. ఈ వ్యతిరేకత దృష్ట్యా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ధైర్యం చేయడం లేదు. ఇప్పటికే తరగతుల విలీనం, పోస్టుల హేతుబద్ధీకరణపై ఉపాధ్యాయులు గుర్రుగా ఉండగా, వారికి యువత తోడయ్యారు.
ప్రతినబూనిన నిరుద్యోగులు
‘ఏపీ డీఎస్సీ అభ్యర్థులమైన మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. 2019లో ప్రతిపక్షంలో ఉన్న ఈ వైకాపా రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది. మెగా డీఎస్సీ పేరిట మభ్యపెట్టి మినీ డీఎస్సీ ఇస్తోంది. ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న 10 లక్షల మంది అభ్యర్థులం రగిలిన గుండెలతో ప్రతిజ్ఞ చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో మా కుటుంబసభ్యులతో కలిపి 40 లక్షల ఓటర్ల సమూహంతో ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తాం’ అంటూ నిరుద్యోగులు ప్రతిజ్ఞ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది.
రోడ్డెక్కిన డీఎస్సీ ఆశావహులు
జగన్ సర్కారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ‘మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ వేస్తోంది’ అని నిరుద్యోగులు మండిపడ్డారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట హైవేపై స్టడీ కుర్చీలు వేసుకొని, డీఎస్సీకి సన్నద్ధమవుతున్నట్లు నిరసన తెలిపారు. సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో ర్యాలీ అనంతరం ఆర్డీవో కార్యాలయం ముట్టడికి యత్నించారు. కనిగిరిలో భారీ ర్యాలీ, రాస్తారోకో తర్వాత ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పామూరు బస్టాండ్ సెంటర్‌లో మానవహారం చేపట్టారు. ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల నడుమ వాగ్వాదం జరిగింది. అనకాపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేత నాగబాబును కలిసి తమ పోరాటానికి మద్దతు కోరారు. విజయనగరం కోట కూడలిలో మానవహారం, ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకున్నా సాయంత్రం వరకూ నిరసన కొనసాగించారు. అప్రెంటిస్‌షిప్ విధానాన్ని రద్దు చేయాలని, వయోపరిమితి సడలించాలని నినదించారు. ‘మెగా డీఎస్సీ ముద్దు.. జగనన్న వద్దు’, ‘డీఎస్సీ ఇవ్వకపోతే ముఖ్యమంత్రిని దించడానికైనా సిద్ధమంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాల్లోనూ అభ్యర్థులు పెద్దసంఖ్యలో నిరసనల్లో పాల్గొన్నారు. వీరి పోరాటానికి తెలుగు యువత, నిరుద్యోగ ఐకాస సంఘీభావం ప్రకటించాయి.
source : eenadu.net
Discussion about this post