తెదేపా హయాంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన బీసీ కార్పొరేషన్లను వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే దెబ్బతీసిందని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. తెదేపా ప్రారంభించిన జయహో బీసీ కార్యక్రమాలను శనివారం ఆత్మకూరు, రాప్తాడులలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే నాడు ప్రత్యేకంగా బీసీ కార్పొరేషన్లను ప్రారంభించి పెద్ద ఎత్తున రాయితీ రుణాలు అందించి బీసీల అభ్యున్నతి కృషి చేసేందిన వివరించారు. నేడు 65 బీసీ కార్పొరేషన్లను ప్రారంభించామని గొప్పలు చెప్పుకుంటున్నా వైకాపా ప్రభుత్వం పైసా అయినా నిధులు కేటాయించిందా అని ప్రశ్నించారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ప్రభుత్వంలో బీసీలపై అనవసర కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. పేరూరు డ్యాంకు రూ.820 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తే ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తాను నిధులు మంజూరు చేయించానని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు.
పరిటాల రవీంద్ర ఎంతోమంది బీసీలకు అండగా నిలబడ్డారన్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి బీసీలపై దాడులు చేయడం బెదిరించి ఆస్తులు లాక్కోవడం వంటివి చేశారన్నారు. కనగానపల్లి మండలం చంద్రచర్లలో వైకాపా కార్యకర్త శివయ్య ఒకే వర్గం వారు రెండు మూడు ఇళ్లు నిర్మించుకున్నారు మాకు ఇళ్లు,బోర్లు లేవని ఎమ్మెల్యేని ప్రశ్నించగా అతన్ని తాగి వచ్చావా అంటూ అవమానించారన్నారు. రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు నారాయణస్వామి, కుమ్మర సాధికారత కన్వీనర్ పోతులయ్య, వక్కలింగ సాధికారత కన్వీనర్ పాండు రంగప్ప, కన్వీనర్, కార్యదర్శి కొండప్ప, శ్రీనివాసులు, సర్పంచులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post