అతివల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్న వైఎస్ జగన్ సర్కార్.. పడతిని ‘పట్ట’పు రాణిని చేస్తోంది. తలదాచుకునే నీడ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిరుపేదలకు ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులైన మహిళలకు పట్టాలు మంజూరు చేసింది. వాటిపై పూర్తి హక్కులు కల్పిస్తూ మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు అనుగుణంగా జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 9వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.
లక్షల విలువచేసే స్థలాలు రిజిస్ట్రేషన్..
ఇంతవరకు తమ పేరిట సెంటు స్థలం లేదని ఆవేదన చెందుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని మహిళలు… ప్రభుత్వ నిర్ణయంతో లక్షాధికారులవుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు సైతం కట్టిస్తున్నారు. స్థలాలు కూడా పట్టణ సమీపంలో ఇచ్చారు. ప్రభుత్వం స్థలాలు మంజూరు చేసిన వివిధ ప్రాంతాల్లో మార్కెట్ రేటు పరిశీలిస్తే సెంటు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా పలుకుతోంది. దీంతో లబ్ధిదారుల్లో ఆనందం నెలకొనగా, వారి సంతోషాన్ని రెట్టింపు చేస్తూ పైసా ఖర్చు లేకుండా ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి పూర్తి హక్కులు కల్పిస్తున్నారు.
సచివాలయాల్లోనే ప్రక్రియ..
‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద స్థలాలు, ఇళ్లు పొందిన మహిళలకు వాటిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ జిల్లాలో ప్రారంభం కానుంది. లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా గ్రామ/వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి అర్హులకు కన్వేనియన్స్ డీడ్స్ ఇవ్వనున్నారు. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
source : sakshi.com
Discussion about this post