రాష్ట్రంలో కులగణన సమగ్ర సర్వే వాలంటీర్లతో చేపట్టడం సహేతుకం కాదని, వెంటనే నిలిపివేయాలని జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మంగళవారం గుంటూరులో విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు. ఏపీలో లోకసభ, శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కులగణన వాలంటీర్లతో నిర్వహిస్తే అధికార పార్టీకి లభ్ది చేకూరుతుందన్నారు. వైకాపా కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకున్నట్లు ముఖ్యమంత్రి, మంత్రులు పదేపదే చెబుతున్నందున.. వారికి ఈ విధులు అప్పగించడం సరికాదన్నారు. కుటుంబాల ఆర్థిక, సామాజిక, కులాల సమాచారం అధికార పార్టీ శ్రేణులకు అందుబాటులోకి రావడం వల్ల ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవన్నారు. దేశవ్యాప్తంగా త్వరలో నిర్వహించనున్న జనాభా లెక్కల సెన్సెస్‌లోనే దీన్ని చేర్చాలన్నారు. ఈ విషయాన్ని భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల అధికారుల దృష్టికి జనచైతన్య వేదిక తీసుకెళుతుందని లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post