గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని కల్లలు చేశారని జగన్ ప్రభుత్వంపై సర్పంచులు ధ్వజమెత్తారు. సచివాలయాలను ఏర్పాటు చేసి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన అధికారాలు ఇవ్వకుండా సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను మళ్లించి పంచాయతీలను అనాథలుగా చేశారని మహాత్ముడి చిత్రపటాల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సర్పంచులు రాష్ట్రవ్యాప్తంగా వినూత్న నిరసనలు, దీక్షలు చేపట్టారు. ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి.లక్ష్మీ ముత్యాలరావు, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడు చింతకాయల ముత్యాలు ఆధ్వర్యంలో అనకాపల్లిలో మోకాళ్లపై కూర్చొని దీక్షలో పాల్గొన్నారు. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలులో నల్ల కండువాలతో నిరసన చేపట్టారు. శ్రీకాకుళంలో కళ్లకు గంతలు కట్టుకొని ప్రభుత్వ తీరును నిరసించారు. తిరుపతి దీక్ష శిబిరంలో పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శింగంశెట్టి సుబ్బరామయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సుమారు రూ.8 వేల కోట్లను దొంగిలించి, రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు దారి మళ్లించడం దారుణమని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, కృష్ణా జిల్లా మచిలీపట్నంతోపాటు చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, అనంతపురం జిల్లా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను తక్షణం పంచాయతీలకు బదిలీ చేయాలని సర్పంచులు డిమాండు చేశారు. ఈ ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెబుతామని బిర్రు ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీ ముత్యాలరావు హెచ్చరించారు. సర్పంచుల 16 డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆమరణ దీక్షలూ చేస్తామని తెలిపారు.
Discussion about this post