ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. ప్రజల్లో మార్పు తీసుకురావాలి. క్షేత్రస్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీని బలోపేతం చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఆదివారం స్థానిక లలిత కళాపరిషత్తులో జరిగింది. షర్మిల జిల్లాకు రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. ఉమ్మడి అనంత జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారు. లలిత కళాపరిషత్తు ప్రాంగణం కార్యకర్తలతో కిక్కిరిసింది. పీసీసీ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, శైలజానాథ్, గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రులు జేడీ శీలం, పల్లంరాజు, సభా కార్యక్రమంలో పాల్గొన్నారు. షర్మిల ప్రసంగిస్తూ వెనుకబడిన అనంతపురం జిల్లా అంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఎంతో ఇష్టం. కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లా అభివృద్ధికి ఆయన పరితపించారన్నారు. రఘువీరారెడ్డి ప్రసంగిస్తూ షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ ఆడపడచు. పార్టీ డీఎన్‌ఏ షర్మిలమ్మలో ఉందన్నారు. నేతలు ప్రతాప్‌రెడ్డి, సుధాకర్, దాదాగాంధి, కోటా సత్యనారాయణ, శంకర్, వాసు, షానవాజ్ నియోజకవర్గాల బాధ్యులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post