పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో ఈ ఎనిమిది స్థానాలూ ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి(ఈసీ) వెంటనే సమాచారాన్ని పంపారు. మంగళవారం ఈ మేరకు గెజిట్ వెలువడనుంది. వారం పది రోజుల్లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతున్న తరుణంలో వైకాపా రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి… తెదేపా అభ్యర్థులుగా గెలిచి వైకాపా పంచన చేరిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్‌లపై అనర్హత వేటు పడింది. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటు పడడం ఇదే ప్రథమం.
వైకాపా రెబల్ ఎమ్మెల్యేలు నలుగురిపై శాసనసభలో ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే తెదేపా తరఫున శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత వైకాపా పంచన చేరిన నలుగురిపై అనర్హత వేటు వేయాలని తెదేపా విప్ డోలా బాలవీరాంజనేయస్వామి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పీకర్ జనవరి 29న తొలిసారి ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా మాట్లాడేందుకు పిలిచారు. వైకాపా రెబల్ ఎమ్మెల్యేలు నలుగురూ స్పీకర్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. తమపై ఫిర్యాదు చేస్తూ చీఫ్‌విప్ సమర్పించిన ఆధారాలకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను తమకు ఇవ్వాలని, వాటిని పరిశీలించి మళ్లీ వస్తామని స్పీకర్‌కు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ కార్యాలయానికి.. ఎమ్మెల్యేలకూ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. మరోవైపు తెదేపా రెబల్ ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ మాత్రమే జనవరి 29న జరిగిన విచారణలో స్పీకర్ ముందు హాజరయ్యారు. మిగిలిన ముగ్గురూ స్పీకర్‌ను కలవలేదు. తర్వాత కూడా ఎమ్మెల్యేలకు వ్యక్తిగత విచారణ కోసం స్పీకర్ సమయం ఇచ్చినప్పటికీ వారు హాజరు కాలేదు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన స్పీకర్ తమ్మినేని ఎనిమిది మంది ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
source : eenadu.net
Discussion about this post