ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 6,100 పోస్టులతో మెగా డీఎస్సీ – 2024 రానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను పెంపొందిస్తూనే టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యాశాఖతో పాటు గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సంపూర్ణ స్థాయిలో బోధన కొనసాగేలా భారీగా ఉపాధ్యాయులను నియమించనుంది. ఎస్సీఈఆర్టీ పర్యవేక్షణలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ సిలబస్) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది టీచర్లకు ఈ విధానంపై సమగ్రంగా శిక్షణ ఇచ్చి 2025–26 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి ఐబీని అందుబాటులోకి తీసుకురానున్నారు.
2.20 లక్షల శాశ్వత ఉద్యోగాలు!
మెగా డీఎస్సీ 2024లో భాగంగా ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 185 సెంటర్లలో 15 రోజుల పాటు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తాం. అంతకంటే ముందు 8 రోజుల పాటు డీఎస్సీ అర్హత కోసం టెట్ పరీక్ష నిర్వహిస్తాం.
డీఎస్సీ 2024 అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు 42 ఏళ్లు వయో పరిమితిని నిర్దేశించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు కల్పించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఒక్క విద్యా రంగంలోనే 14,219 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టింది. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల విధానాన్ని తేవడంతో 7,761 పోస్టుల్లో కొత్త ఉపాధ్యాయులు చేరారు
.డీఎస్సీతో పాటు అటవీ శాఖలో ఫారెస్టు రేంజర్లతో సహా వివిధ విభాగాల్లో 689 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నాం. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను నెలకొల్పి ఒక్కసారే 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది. ఇలా వివిధ శాఖల్లో కలిపి ఇప్పటికే 2.13 లక్షల శాశ్వత ఉద్యోగాలను కల్పించాం. తాజా నోటిఫికేషన్ల ద్వారా మరో 7 వేల పోస్టులతో కలిపి 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అందించినట్లు అవుతుంది.
source : sakshi.com
Discussion about this post