పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు చెల్లించేందుకు జగన్ ప్రభుత్వం ఎంత మాత్రం ఆసక్తి చూపడం లేదు. జగన్ అయిదేళ్ల పాలనలో పరిశ్రమల కోసం బటన్ నొక్కింది ఒకటిరెండు సార్లు మాత్రమే. పైకి మాత్రం పారిశ్రామికవేత్తలను చేయి పట్టుకు నడిపిస్తామని.. ఫోన్‌కాల్ దూరంలో ప్రభుత్వం ఉందంటూ మాటలు చెప్పడం మినహా ప్రోత్సహిస్తున్నది లేదు. ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ ప్రకారం పరిశ్రమలకు ఏటా ఆగస్టు మాసంలో ప్రోత్సాహకాలను క్రమం తప్పకుండా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే కొవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజి అంటూ ఒకసారి.. ఆ తర్వాత 2021లో మరోసారి మాత్రమే ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి బటన్ నొక్కారు. 2022 నుంచి ప్రోత్సాహకాల మాటే ప్రభుత్వానికి గుర్తుకు రాలేదు. రెండేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు వేసి.. 2024 ఫిబ్రవరిలో చెల్లిస్తామంటూ గత అక్టోబరులో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికీ ప్రోత్సాహకాల చెల్లింపుల ప్రతిపాదనలో కదలిక లేదు. మరో 9 రోజుల్లో ఫిబ్రవరి కూడా ముగియనుంది.
వాయిదాలతో కాలక్షేపం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), భారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలను రెండేళ్లుగా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. 2022 ఆగస్టులో ప్రోత్సాహకాల విడుదల కోసం పరిశ్రమల శాఖ హడావుడిగా జాబితాలు సిద్ధం చేసింది. ఒకటిరెండు రోజుల్లో చెల్లించేలా కసరత్తు చేసింది. ఆ ఏడాది దసరాకు (అక్టోబరులో) చెల్లిస్తామంటూ అధికారులు అప్పట్లో చెప్పుకొచ్చారు. ఆ గడువు కూడా ముగియడంతో ప్రభుత్వం మాట మార్చింది. 2023 మార్చిలో విశాఖలో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు ముందు ఫిబ్రవరిలో ఇవ్వాలనుకున్నామని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డుపడిందని మంత్రి అమర్‌నాథ్ అప్పట్లో తెలిపారు. అయితే కోడ్ ముగిసినా ప్రోత్సాహకాలను మాత్రం చెల్లించలేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రోత్సాహక రాయితీల కింద ఎంఎస్‌ఎంఈలకు రూ.726 కోట్లు చెల్లించాలని పరిశ్రమల శాఖ లెక్కలు తేల్చింది. జనరల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలుగా వర్గీకరించి పరిశ్రమలశాఖ జాబితాలను రూపొందించింది. 2023-24కు సంబంధించిన ప్రోత్సాహకాలను 2023 జులైలోనే చెల్లిస్తామని ప్రకటించి..మళ్లీ మాట తప్పింది. ఈ రెండేళ్లలో చిన్న, భారీ, ఫుడ్ ప్రాసెసింగ్, నూలు పరిశ్రమలకు కలిపి సుమారు రూ.2,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిని ఈ నెలలో చెల్లిస్తామని చెప్పింది. ఇందుకు ఇప్పటికే కసరత్తు జరగాలి. కానీ, ఆ దిశగా ప్రక్రియ మొదలు కాలేదు.
అయిదుసార్లు చెల్లించాల్సి ఉన్నా..
ప్రభుత్వం చెప్పిన మేరకు అయిదేళ్లలో.. అయిదుసార్లు బటన్ నొక్కి ప్రోత్సాహకాలను చెల్లించాలి. కానీ, రెండేళ్లు మాత్రమే ప్రభుత్వం బటన్ నొక్కింది. కొవిడ్ సమయంలో తప్పని పరిస్థితుల్లో 2020లో ఒకసారి బటన్ నొక్కి.. ఆ తర్వాత నూలు మిల్లులకు మెజారిటీ వాటా ఇచ్చేలా 2021లో రెండోసారి బటన్ నొక్కింది. ఆ తర్వాత ప్రోత్సాహకాల చెల్లింపునకు బటన్ నొక్కాలన్న సంగతినే ప్రభుత్వం మరచిపోయింది.
2020లో రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఎంఎస్‌ఎంఈ లకు రూ.903.91 కోట్లు రెండు విడతల్లో చెల్లించింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.58.51 కోట్లు విడుదల చేసింది.
2021 సెప్టెంబరు 3న ఎంఎస్‌ఎంఈ లకు రూ.440 కోట్లు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్లులకు రూ.684 కోట్లు ఇచ్చింది.
పరిశ్రమలను ప్రోత్సహించడంలో జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి 2022-23 బడ్జెట్‌లో పరిశ్రమల శాఖకు కేటాయింపులు.. ఖర్చులు చూస్తే ఇట్టే తెలుస్తుంది. బడ్జెట్‌లో రూ.411.62 కోట్లు ప్రతిపాదించి.. సవరించిన అంచనాల మేరకు ఏకంగా రూ.366.49 కోట్లు కోత పెట్టింది. మిగిలింది రూ.45.62 కోట్లు మాత్రమే. ఆ మొత్తం సిబ్బంది జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు సరిపోతుంది.
రీస్టార్ట్ ప్యాకేజీలోనూ బకాయిలే
రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా పరిశ్రమలకు విద్యుత్ గరిష్ఠ డిమాండ్ ఛార్జీలు రూ.205 కోట్లు మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. మూడేళ్లు గడిచినా ఈ విషయం పట్టించుకోలేదు. కొవిడ్ లాక్‌డౌన్‌తో 2020 ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ కాలానికి విద్యుత్ గరిష్ఠ డిమాండ్ ఛార్జీల రూపంలో ఎంఎస్‌ఎంఈలు చెల్లించాల్సిన రూ.188 కోట్లు.. భారీ, మెగా పరిశ్రమలు కట్టాల్సిన రూ.17 కోట్లకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ మొత్తాన్ని ప్రతి నెలా బిల్లులో కలిపి పారిశ్రామికవేత్తల నుంచి డిస్కంలు వసూలు చేశాయి. విద్యుత్ ఛార్జీల మినహాయింపు కోసం వివిధ పరిశ్రమల నుంచి అందిన దరఖాస్తుల ఆధారంగా 6 వేల ప్రతిపాదనలను అధికారులు రెండేళ్ల కిందట ఆమోదించారు. ఇందుకు సుమారు రూ.100 కోట్లు చెల్లించాల్సి వస్తుందని అంచనాలు వేశారు. రీస్టార్ట్ భారం 50 శాతం తగ్గించినా.. ఇప్పటికీ వాటిని తిరిగి చెల్లించలేదు.
source : eenadu.net
Discussion about this post