పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల సమర భేరి మోగించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. జనబలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా ఇప్పటికే శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు.
ఒకవైపు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై అసమ్మతి సెగలు పొగలు కక్కుతుండగా రెట్టించిన ఉత్సాహంతో అభ్యర్థులను ఖరారు చేసి కదనరంగంలోకి దూకేందుకు వైఎస్సార్ సీపీ సన్నద్ధమైంది. ఈమేరకు ఈనెల 16వతేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద 2019 ఎన్నికల తరహాలోనే ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉంది.
అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రోజుకు రెండు లేదా మూడు సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధమైంది. రోజూ ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు చోట్ల బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు.
source : sakshi.com
Discussion about this post