జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లో అయోమయం.. గందరగోళం నెలకొంది. ఉందామా… పోదామా అన్న విషయం తేల్చుకోలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. రాజకీయంగా తమ భవిష్యత్ ఏమిటో అర్థం కాక సందిగ్ధంలో పడిపోయారు. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ నేతలు జనంతో మమేకమవుతూ ఊరూవాడా తిరుగుతుండగా..టీడీపీ నేతలు మాత్రం టికెట్ వస్తుందా..రాదా..అన్న ఆలోచనలో మునిగిపోయారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనూ టీడీపీ నేతలు ఇళ్లకే పరిమితమయ్యారు. అధినేత చంద్రబాబు ఎటూ తేల్చకపోవడంతో ఎటు వెళ్లాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హిందూపురం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల పేర్లు ప్రకటించారు. వారంతా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని ప్రజల్లో తిరుగుతున్నారు. ఇది టీడీపీ నాయకులకు మింగుడు పడటం లేదు. చంద్రబాబు అభ్యర్థుల జాబితాను ఎప్పుడు ప్రకటిస్తారు? ఇంతకీ తమకు టికెట్ వస్తుందా? రాదా? ఒకవేళ టికెట్ రాకపోతే తమ రాజకీయ భవితవ్యం ఏమిటి? అని టీడీపీ సీనియర్లు అంతర్మథనంలో పడ్డారు. తమకు టికెట్ దక్కని పక్షంలో పార్టీ అభ్యర్థులను ఓడించడం ఖాయమని కొందరు అంటుండగా..మరికొందరు మాత్రం పార్టీని వీడేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్నారు.
అందరిదీ అదే టెన్షన్
► హిందూపురం అసెంబ్లీ టీడీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకే దాదాపుగా ఖరారు చేశారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు కుప్పంతో పాటు రెండో స్థానం హిందూపురం నుంచి కూడా పోటీ చేయవచ్చని మరికొందరు టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఇక్కడ టీడీపీ టికెట్ ఎప్పుడూ స్థానికేతరులకేనా అని సొంత పార్టీ నాయకులే కొందరు విమర్శిస్తున్నారు.
► పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ టికెట్ దాదాపుగా తనకే దక్కుతుందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పైకిచెబుతున్నప్పటికీ లోలోన బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటివరకూ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రాకపోవడం, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సైతం పుట్టపర్తి సీటు ఆశిస్తుండడంతో పల్లె భయానికి కారణంగా తెలుస్తోంది. ఇంకోవైపు ధర్మవరానికి చెందిన వరదాపురం సూరి పేరు కూడా బాగా వినిపిస్తోంది. ఇక తాజాగా కదిరి పట్టణానికి చెందిన బ్లూమూన్ విద్యాసంస్థ అధినేత శివశంకర్ ఈ మధ్యే జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన కూడా పొత్తులో భాగంగా పుట్టపర్తి ఎమ్మెల్యే టికెట్ జనసేన తరఫున తనకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. అదే జరిగితే ‘పల్లె’ పార్టీని వీడేది ఖాయమని ఆయన అనుచరులు అంటున్నారు.
► కదిరి నియోజకవర్గంలో కందికుంట వెంకట ప్రసాద్ పేరును ఇప్పటికే చంద్రబాబు ప్రకటించినా, నకిలీ డీడీల కేసు ఆయన్ను వెంటాడుతోంది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఆయన భార్య యశోదమ్మకు టికెట్ ఇవ్వాలని కందికుంట అనుచరులు కోరుతున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా మైనార్టీ కోటాలో ఈసారి కదిరి టికెట్ తనకే దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఇప్పటికే కొంత డబ్బు కూడా డిపా జిట్ చేసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే కందికుంట పార్టీని వీడేది ఖాయమని కొందరంటున్నారు.
► ధర్మవరం టీడీపీ టికెట్ ఈసారి తనకేనని బీజేపీలో ఉన్న వరదాపురం సూరి చెబుతుండగా, ఇప్పటి దాకా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న తన పరిస్థితి ఏమిటని పరిటాల శ్రీరామ్ ఆగ్రహిస్తున్నారు. వరదాపురానికే ఇక్కడ టికెట్ ఇస్తే ఆయన్ను ఓడించడం ఖాయమని శ్రీరామ్ వర్గం అంటోంది. మరోవైపు పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ జనసేనకు కేటాయిస్తారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి ధర్మవరం టికెట్ ఇవ్వకపోతే టీడీపీకి ధర్మవరంలో పుట్టగతులు ఉండవని వరదాపురం సూరి అనుచరులతో పాటు శ్రీరామ్ అనుచరులు కూడా కొందరు బహిరంగంగా హెచ్చరిస్తున్నారు.
► పెనుకొండ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున ఈసారి బీకే పార్థసారథి బదులు సవితమ్మకు కేటాయించే అవకాఽశముందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈసారి బీకేను హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇందుకు బీకే సుముఖంగా లేరు. ఇదే విషయాన్ని ఆయన ఇటీవల నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో తేల్చిచెప్పారు. పెనుకొండ నుంచి తానే పోటీ చేస్తున్నానని ప్రకటించుకున్నారు.
► మడకశిర నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో ఇక్కడ టీడీపీ తరఫున ఈరన్న లేదా ఆయన కుమారుడు బరిలో దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వారిరువురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఓడించడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అనుచరులు హెచ్చరిస్తున్నారు.
source : sakshi.com
Discussion about this post