సమష్టి కృషితో జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బుక్కపట్నం నవీన్ నిశ్చల్ అన్నారు. సోమవారం ఆయన హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి టీఎన్ దీపిక, పార్లమెంట్ అభ్యర్థి జె.శాంతమ్మ, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ, మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, పార్టీ మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, నాయకురాలు చౌళూరు మధుమతిరెడ్డి తదితరులతో కలిసి స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జిల్లా బాధ్యతలు అప్పగించారని, ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి జగనన్నకు కానుక ఇస్తానన్నారు. జన సంక్షేమమే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ అజెండా అని, జనానికి మంచి చేసేందుకే జగన్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. దోచుకోవడం తప్ప సేవ చేయడం తెలియని కొందరు… అధికారం కోసం గుంపుకట్టారనీ, పొత్తుల పేరుతో దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. విజ్ఞత గల జనం జగన్‌ను గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్ని జెండాలు ఏకమైనా వైఎస్సార్ సీపీ విజయాన్ని ఆపలేవన్నారు.
దివంగత నేత రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. ఇక్కడి నుంచి రెండు దశాబ్దాలుగా అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. హిందూపురం అభివృద్ధి తమ బాధ్యత అని, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు వైఎస్సార్ సీపీ హిందూపురం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల నుంచి ఇద్దరు బీసీ మహిళలు టీఎన్ దీపిక, జె.శాంతమ్మలకు అవకాశం ఇచ్చిందన్నారు. అందువల్లే బడుగు, బలహీన వర్గాలంతా వారికి మద్దతు పలుకుతున్నారన్నారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ ఎందుకని బీసీలకు టిక్కెట్లు ఇవ్వలేకపోయిందో చెప్పాలన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో ఈ సారి హిందూపురంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి టీఎన్ దీపిక, పార్లమెంట్ అభ్యర్థి జె.శాంతమ్మ మాట్లాడుతూ.. హిందూపురం సమగ్రాభివృద్ధికి తమవంతు కృషి చేస్తామన్నారు. చుట్టపుచూపుగా హిందూపురం వచ్చే బాలకృష్ణ పదేళ్ల కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
source : sakshi.com
Discussion about this post