ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు సాంబశివారెడ్డి సూచనతో నియమించిన వైకాపా సమన్వయకర్త వీరాంజనేయులు అభ్యర్థిత్వాన్ని తక్షణమే మార్చాలని అసమ్మతి నేతలు స్పష్టం చేశారు. అనంతపురం నగరంలోని గుత్తి రోడ్‌లో శుక్రవారం వారు సమావేశం ఏర్పాటుచేశారు. మొత్తం 600 మందికిపైగా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసమ్మతి నేతలు పలువురు మాట్లాడారు.
గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా పద్మావతిని గెలిపించామన్నారు. ఆమె భర్త సాంబశివారెడ్డి బంధువులతో కలిసి నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. మండలానికి ఒక ఇన్‌ఛార్జిని పెట్టుకుని దోచుకున్నారని ధ్వజమెత్తారు. తామంతా వీరాంజనేయులుకు వ్యతిరేకం కాదు. సాంబశివారెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి నాయకత్వానికి వ్యతిరేకం అన్నారు. సమావేశంలో వైకాపా నాయకులు సత్యనారాయణరెడ్డి, గువ్వల రాజశేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి, మిద్దెకుళ్లాయప్ప, రాజగోపాల్, గోకుల్‌రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post