రాష్ట్రంలో ఎన్నికల బరిలోకి ఉమ్మడిగా దిగుతున్నా వైఎస్సార్‌సీపీకి పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంపై బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నేతలను ఆందోళన ఆవహించింది. చంద్రబాబు నివాసంలో శుక్రవారం జరిగిన కూటమి నేతల సమావేశంలో దీనిపైనే చర్చ జరిగింది. ఎంత ప్రయత్నించినా ప్రజల నుంచి ఆశించిన స్పందన కనిపించడంలేదని, కూటమి సభలకు జనం అనుకున్నట్లుగా రావడంలేదని, మిగిలిన అంశాల్లోనూ అధికార పార్టీని ఎదుర్కొనే పరిస్థితిలేదని మూడు పార్టీల నేతలు చర్చించుకున్నట్లు తెలిసింది.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ పరిశీలకులు సిద్ధార్థనాథ్‌సింగ్, అరుణ్‌సింగ్‌లు సమావేశమై పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఇటీవల గోదావరి జిల్లాల్లో ఉమ్మడిగా నిర్వహించిన సభలకు ఆశించిన స్థాయిలో జనం రాలేదని బీజేపీ ముఖ్యులు అన్నట్లు సమాచారం.
విడివిడిగా సభలు పెడితే అసలు జనం రావడంలేదని, ఉమ్మడిగా పెట్టినా ఫలితం ఉండడంలేదని, ఇప్పుడు ఏం చేయాలనే దానిపై మూడు పార్టీల నేతలు మల్లగుల్లాలు పడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో ఉమ్మడి సభలు ఎక్కువగా నిర్వహిద్దామని, వాటికి జనాన్ని ఎక్కువగా సమీకరించాల్సి వుందని సమావేశంలో చంద్రబాబు ప్రతిపాదించారు. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాల్సి వుందని, ఇప్పటికే ప్రాథమికంగా దీన్ని రూపొందించామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.
source : sakshi.com
Discussion about this post