సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపింది. నాలుగున్నరేళ్లుగా నడుస్తున్న ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తానే అడ్డుకుని ఆ నెపాన్ని ప్రతిపక్ష తెదేపాపై నెడుతోంది. పింఛన్ల పంపిణీని గ్రామ/వార్డు సచివాలయాలకే పరిమితం చేసి వృద్ధులతోపాటు దివ్యాంగులు, మహిళల్ని మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు 42 డిగ్రీలకు పైగా ఎండల్లో నడిపించే వికృత రాజకీయ క్రీడ ప్రారంభించింది. గిరిజన ప్రాంతాల్లోని పింఛనుదారుల్ని కొండలు, గుట్టలు ఎక్కించి వాగులు, వంకలు దాటించి మరింత ఇబ్బందులు పెట్టే దుర్మార్గానికి ఒడిగట్టింది. దీనంతటికీ ప్రతిపక్షాలే కారణమనేలా.. పింఛనుదారులందరిలో విషబీజాలు నాటడమే వైకాపా సర్కారు ముఖ్య ఉద్దేశం. అందుకు అనుగుణంగానే శనివారం సాయంత్రం నుంచే సామాజిక మాధ్యమాల వేదికగా విషం చిమ్మే ప్రక్రియ మొదలు పెట్టింది. 15 వేలకు పైగా సచివాలయాల్లోని 1.35 లక్షల మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు సునాయాసంగా ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా కావాలనే పక్కన పెట్టి కుటిల రాజకీయం చేస్తోంది. ఇందులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ కీలక అధికారి, సెర్ప్ సీఈఓ మురళీధర్‌రెడ్డిల ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శల్ని సీఎస్ జవహర్‌రెడ్డి మూటగట్టుకుంటున్నారు. పింఛనుదారుల్ని సచివాలయాల దగ్గరకు రప్పించి నిరీక్షించేలా చేయాలని.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇబ్బందులు పెట్టి చంద్రబాబు కారణంగానే ఇలాంటి పరిస్థితొచ్చిందని వైకాపా ప్రచారం చేసేలా అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి.
వాస్తవానికి వాలంటీర్లు లేకపోయినా ఇంటింటికీ పింఛను పంపిణీ చేయడానికి సరిపడా ఉద్యోగులు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉన్నారని ఎన్నికల సంఘానికి ప్రభుత్వ యంత్రాంగం ముందుగానే సమాచారం ఇచ్చింది. తీరా వాలంటీర్లను పక్కన పెట్టాలనే ఆదేశాలు వెలువడ్డాక అసలు వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. సచివాలయాల వద్దనే పంపిణీ చేయాలంటూ సెర్ప్ సీఈఓ మురళీధర్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని తాము డిమాండు చేశాక.. ఆఘమేఘాలపై సచివాలయాల వద్దే ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారని తెదేపా అనుమానిస్తోంది. ఈ ఉత్తర్వులు ఇంకా క్షేత్రస్థాయి అధికారులకు చేరకముందే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటింటికీ పింఛన్లు ఇవ్వడం లేదంటూ విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించడం గమనార్హం.
వాలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి పక్కన పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీపై ఉన్నతస్థాయి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సరిపడా ఉద్యోగులు ఉన్నా, మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేయొచ్చని తెలిసినా సీఎంఓలో అన్ని వ్యవహారాలూ తానై నడిపే కీలక అధికారి అలా చేయొద్దని చెప్పారని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. పింఛనుదారులందరినీ సచివాలయాలకు పిలిపించేలా ఆయన నిర్ణయం తీసుకుని సెర్ప్ ద్వారా ఉత్తర్వులు ఇప్పించారని విమర్శిస్తున్నాయి. సదరు అధికారి 2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జగన్ చెంత చేరారు. అప్పటి నుంచి అధికార యంత్రాంగంలో ఆయనే నంబర్ 1. సివిల్ సర్వీసు అధికారుల నియామకం నుంచి వైకాపా టికెట్ల పంపిణీ వరకు అన్నీ తానై చక్రం తిప్పుతుండటంతో పాటు వైకాపా ఎమ్మెల్యే, ఎంపీల పనితీరుపై సర్వే ఫలితాలను ఆయనే పర్యవేక్షించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నాయి.]
ఒక్కో సచివాలయం పరిధిలో సగటున 9 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా పంపిణీ చేయాల్సిన పింఛన్లు 350 నుంచి 500 వరకు ఉంటాయి. అంటే ఒక్కో సచివాలయ ఉద్యోగికి సగటున 49 వరకు వస్తాయి. వాలంటీర్లు ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి నాలుగైదు రోజుల సమయం తీసుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా రెండు, మూడు రోజుల్లోనే పంపిణీ పూర్తి చేయించవచ్చు. ఇప్పుడు వారికి పని ఒత్తిడి ఏమీ లేదు.
source : eenadu.net
Discussion about this post