నారా లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్లతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్.. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని, రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయస్ధానానికి దురుద్దేశాలు ఆపాదించారు.
రెడ్ బుక్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగాన్ని బెదిరిస్తూ భయోత్పాతానికి గురి చేశారు. వీడియోలతో సహా ఏసీబీ కోర్టులో గత నెలలో సీఐడీ పిటిషన్ వేసింది. ఏసీబీ కోర్టు ఆదేశాలతో నోటీసులు పంపినా లోకేష్ అందుకోలేదు. చివరగా ఏసీబీ కోర్టు నుంచే లోకేష్‌కి నోటీసులు అందాయి.
స్వయంగా హాజరు లేదా న్యాయవాది ద్వారా విచారణకి రావాలని గత వారం కోర్టు ఆదేశించింది. ఈ నెల 22న జరిగిన విచారణలో లోకేష్ న్యాయవాదులు రెండు వారాల సమయం కోరారు. ఒక వారమే సమయమిచ్చిన న్యాయస్ధానం.. నేడు విచారణ జరపనుంది.
యువగళం ముగింపు సమయంలో లోకేష్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో.. తన తండ్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ తప్పుడు కేసులు బనాయించిందని, రిమాండ్ విధించడం తప్పంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థను కించపరిచేలా ఉన్నాయని.. ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాల్ని తప్పుబట్టేలా ఉన్నాయని.. అన్నింటికి మించి కోర్టు ఆదేశాల్ని ధిక్కరించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ మెమోలో సీఐడీ పేర్కొంది.
source : sakshi.com
Discussion about this post