ఉమ్మడి అనంతపురం జిల్లా కొన్ని దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని ఆదరించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. 2014-19 మధ్య రెట్టింపు ప్రేమతో అనంతను అభివృద్ధి చేశామన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సాగునీటి రంగాల్లో అభివృద్ధికి ప్రణాళికలు వేసి ముందుకు తీసుకెళ్లామన్నారు. మరో ఐదేళ్లు తెదేపా ఉండి ఉంటే అనంతపురం జిల్లా నంబర్‌వన్ స్థానానికి చేరుకునేదని తెలిపారు. జిల్లా మనవడిని అని చెప్పుకొనే సీˆఎం జగన్ ఈ ఐదేళ్లలో చేసిందేం లేదని విమర్శించారు. వచ్చేది తెదేపా-జనసేన ప్రభుత్వమేనని.. అనంతపురం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. సోమవారం అనంతపురం, తాడిపత్రి నియోజకవర్గాల్లో నిర్వహించిన శంఖారావం సభల్లో ఆయన మాట్లాడారు. రైతులకు పెద్ద ఎత్తున డ్రిప్ పరికరాలు అందించామన్నారు. జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మార్చామన్నారు. కరవు సమయంలో రైతుల్ని ఆదుకునేందుకు ఒక్క ఏడాదే రూ.2 వేల కోట్లు పెట్టుబడి రాయితీ ఇచ్చామన్నారు. 600 ఎకరాల్లో కియా ఏర్పాటు చేసి 50 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు.
వైకుంఠం ప్రభాకర్‌చౌదరి నేతృత్వంలో అనంతపురం నగర అభివృద్ధికి రూ.1,500 కోట్లు ఖర్చు చేసినట్లు లోకేశ్ తెలిపారు. సీˆసీˆరోడ్లు, బీటీ రహదారులు, బ్రిడ్జీలు, పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, తాగునీటి పథకాలు నిర్మించామన్నారు. 6 వేల టిడ్కో ఇళ్లు మంజూరు పనులు పూర్తి చేశామన్నారు. వైకాపా ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులు కూడా చేయలేదన్నారు. నగరానికి రూ.91 కోట్లతో తాగునీటి పైపులైన్ ఏర్పాటు చేశామన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. స్టేడియాన్ని అభివృద్ధి చేశామన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మేం నిర్మిస్తే దానికి డాక్టర్లను కూడా నియమించలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పెద్ద అవినీతిపరుడని ఆరోపించారు. ఎవరైనా సమస్యతో వెళితే హడావిడిగా 9 నంబర్లు కొట్టి అవతలి వ్యక్తులతో మాట్లాడినట్లు బిల్డప్ ఇస్తారన్నారు. ఆయన ఏ ఒక్కరికీ మేలు చేయలేదని విమర్శించారు. చిత్తూరు జిల్లాకు చెందిన పాపాల పెద్దిరెడ్డి అనంతను దోచేందుకు ఇక్కడకు వచ్చాడన్నారు. ఆయన్ను అనంత ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెదేపా-జనసేన అభ్యర్థిని గెలిపిస్తే ఔటర్ రింగురోడ్డు పూర్తిచేస్తామన్నారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తామన్నారు. వంద రోజుల్లో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. డంపింగ్ యార్డును తరలించి మోడల్ డంపింగ్ యార్డును తీసుకొస్తామన్నారు.
‘‘2019 ఎన్నికల్లో తప్ప తాడిపత్రి ప్రజలు ప్రతిసారీ జేసీˆ కుటుంబాన్ని ఆదరించారు. జేసీˆ సోదరులు నియోజకవర్గానికి పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చారు. భూగర్భ డ్రైనేజీ, సురక్షిత తాగునీటి పథకాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గం అభివృద్ధికి జేసీˆ ప్రభాకర్‌రెడ్డి అహర్నిశలు కష్టపడ్డారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూ.2 వేల కోట్లతో పనులు చేశారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద కోరికలు అడిగేవారు కాదు. కానీ ఒక పేపరు తెచ్చి ఇవి మంజూరు చేస్తేనే వెళ్తాను అని అనేవారు. మీరు మాత్రం పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును గెలిపించారు. తాడేపల్లిలో పెద్దపిల్లి, తాడిపత్రిలో చిన్నపిల్లి ఉంది. దానిపేరే పెద్దారెడ్డి. ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో లేని సమయంలో ఇంటికెళ్లి అహంకారంగా వ్యవహరించారు. ఎన్నికల ముందు చిన్నకారులో వచ్చిన పెద్దారెడ్డి ఇప్పుడు కాన్వాయ్‌లో తిరుగుతున్నాడు. పందులను కూడా వదలకుండా అందులోనూ డబ్బులు నొక్కేశాడు. మూతపడ్డ గ్రానైట్ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చి తెరిపిస్తాం. పెండేకల్లు ప్రాజెక్టును పూర్తి చేస్తాం.చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మంగళగిరిలో టాటా సంస్థ సహకారంతో వీవర్స్‌శాల ఏర్పాటు చేసి చేనేతల ఆదాయం పెంచాం. తాడిపత్రి పట్టణానికి కూడా టాటా ప్రాజెక్టును తీసుకొస్తాం.’’ అని హామీ ఇచ్చారు.
source : eenadu.net
Discussion about this post