మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు పొడవడం, కుట్రలు చేయడంలో చంద్రబాబుకు 45 సంవత్సరాల అనుభవం ఉందని.. చేయాల్సిన నేరాలన్నీ చేసేసి నెపం వైఎస్సార్‌సీపీపైకి తోయడంలో ఆయనకు ఎవరూ సాటిలేరని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని ఎవరు చంపారో, ఎందుకు చంపించారో.. వారితో ఇప్పుడెవరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారో అందరికీ తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ, చంద్రబాబు బంధువులవని తేలినా, ఎల్లో మీడియా సహకారంతో ఆ నెపాన్ని మనపై నెట్టేందుకు క్షణాల్లో రెడీ అయ్యారని మండిపడ్డారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడంలో, గోబెల్స్ ప్రచారంలో, కుటుంబాలను చీల్చడంలోనూ చంద్రబాబు అనుభవాన్ని చూస్తున్నామని ధ్వజమెత్తారు. బుధవారం ఇడుపులపాయలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్.. ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
‘వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపానని హేయంగా చెప్పుకుని తిరుగుతున్నా ఆ హంతకుడికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకుంటున్నారు చంద్రబాబు, ఎల్లో మీడియా. ఈ హంతకుడికి రాజకీయ కాంక్షతో ఒకరిద్దరు నా వాళ్లు కూడా మద్దతిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నాన్నను ఓడించిన వారితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. వివేకం చిన్నాన్న బతికున్నంత వరకు చంద్రబాబును శత్రువుగా భావించారు. చనిపోయిన తర్వాత శవ రాజకీయాలతో కుట్రలు చేస్తున్నారు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు వెన్నుపోటు పొడిచి, చనిపోయిన తర్వాత శవాన్ని లాక్కొని ఊరూరా విగ్రహాలు పెడుతూ దండలు వేస్తున్నారు.
నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయో ప్రజలు ఆలోచించాలి. నన్ను దెబ్బ తీసేందుకే కుట్రలు చేస్తున్నారు. ఇది కలియుగం కాక మరేమిటి? ఎవరెన్ని కుట్రలు పన్నినా నేను మాత్రం ప్రజల పక్షమే. ఆ దేవుడు, ప్రజల్నే నమ్ముకున్నా. ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నా. ప్రజలకు మంచి చేసిన చరిత్ర మనది. వారిలా వంచించిన చరిత్ర మనకు లేదు. మేనిఫెస్టోలో పది శాతం వాగ్దానాలు కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలుగా భావించి, త్రికరణ శుద్ధిగా 99 శాతం వాగ్దానాలను అమలు చేసి నిలబెట్టుకున్న చరిత్ర మన ప్రభుత్వానిది. ఈ తేడాను ప్రజలందరూ గమనించాలి’ అని చెప్పారు.
source : sakshi.com
Discussion about this post