మే 13వ తేదీ పోలింగ్ రోజు మీరంతా నొక్కే బటన్‌కు వైకాపా నాయకుల్లో దడ పుట్టాలని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. శెట్టూరులో శనివారం వారు రోడ్‌షో నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు అశేష సంఖ్యలో హాజరై అభ్యర్థులకు అడుగడుగునా నీరాజనం పట్టారు. ముందుగా అభ్యర్థులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ తాను ప్రజా సేవ కోసమే వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందిస్తే పొలాల్లో బంగారం పండిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే రెండున్నరేళ్లలో నియోజకవర్గంలోని 114 చెరువులకు నీరిచ్చి రుణం తీర్చుకుంటానని తెలిపారు. గత పాలకుల మాదిరి అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు చేయనని సభాముఖంగా చెబుతున్నానని సురేంద్రబాబు అన్నారు. ఈ పనులన్నీ సకాలంలో జరగాలంటే చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలో గత ఐదేళ్లలో ఏం జరిగిందో మీరే చూశారు. నేను అలా చేయను. అవకాశం ఇస్తే యువత, మహిళలకు ఉపాధి కల్పిస్తా. గ్రామాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా శెట్టూరు, బచ్చేహళ్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 30 మంది సురేంద్రబాబు ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. శెట్టూరులో అనారోగ్యంతో మృతి చెందిన తెదేపా కార్యకర్త జయరామ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
source : eenadu.net
Discussion about this post