మే 13న జరగబోయేది తెదేపా కూటమి అనుకూల ఏకపక్ష పోలింగ్ అని, ఎన్డీయే గెలుపు ఖాయమైందని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్‌ను ఇంటికి పంపడం తప్పదన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ప్రకాశం జిల్లా మార్కాపురం, బాపట్ల జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలలో ఆయన మాట్లాడారు. రాయలసీమలో తాగడానికి మంచినీళ్లు ఇవ్వలేని జగన్ ముద్ర ఎక్కడుందని ప్రశ్నించారు. ‘సీమలో అయిదేళ్లలో తట్టెడు మట్టి ఎత్తలేదు. 102 ప్రాజెక్టులు రద్దుచేశారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తిచేయలేదు. నీళ్లు లేని వెనకబడిన ప్రాంతం కర్నూలు. కనీసం నీళ్లివ్వాలని ఆలోచించారా? నేనూ రాయలసీమ బిడ్డనే. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.68వేల కోట్లు వెచ్చించాం. రాయలసీమకే రూ.12వేల కోట్లు ఖర్చుచేశాం. జగన్ కేవలం రూ.2వేల కోట్లు కేటాయించారు’ అని చంద్రబాబు వివరించారు.
‘వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశా. కోర్టు కేసుల వంటి సమస్యలనూ పరిష్కరించుకుని ముందుకెళ్లాం. తెదేపా హయాంలోనే 80% పనులు చేశాం. అధికారం కొనసాగితే 2020 నాటికే ప్రాజెక్టు పూర్తిచేసి నీళ్లిచ్చేవాళ్లం. ఆ తర్వాత వచ్చిన జగన్ డబ్బులకు కక్కుర్తిపడి గుత్తేదారును మార్చారు. మిగిలిన 20% పనులూ చేయలేకపోయారు. నిర్వాసితులకు పరిహారం అందించలేదు. నీళ్లివ్వకుండా సొరంగాలకు రిబ్బన్ కత్తిరించి ప్రాజెక్టు ప్రారంభమంటూ అబద్ధపు ప్రచారం చేయించుకున్నారు. 72% పనులైన పోలవరాన్నీ నాశనం చేశారు. బుద్ధున్నోడు ఎవరైనా ఇలా చేస్తారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. తాను శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టును తానే పూర్తిచేసి నీళ్లిస్తానని, దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘సీమలో 52 మంది ఎమ్మెల్యేల్లో 49 మంది వైకాపావారు గెలిచారు. వారు ఒక్క పనైనా చేశారా? మీ భవిష్యత్తు గురించి ఆలోచించారా?’ అని ప్రశ్నించారు.
సామాజిక న్యాయం ఎవరిది?
‘తెదేపా వెనకబడిన వర్గాలకు అత్యధికంగా సీట్లు ఇచ్చింది. పేర్లతో సహా దీనిపై చర్చించేందుకు సిద్ధం. మీరు సిద్ధమా? ఒకే వర్గానికి 49 సీట్లు ఇచ్చిన వైకాపా నాయకులా మాట్లాడేది? సామాజిక న్యాయం అందించేదే తెదేపా. వైకాపాది బూటకపు న్యాయం. తెదేపా పేదల ప్రగతికి పనిచేసింది. బుట్టా రేణుక పేద మహిళ అంటూ జగన్‌రెడ్డి ప్రకటించారు. 2014లోనే ఆమె ఆస్తి రూ.250 కోట్లు. బీవై రామయ్య కూడా పేదనట. మంత్రాలయంలో బాలనాగిరెడ్డి ఇసుక, మట్టితోపాటు మంత్రాలయం క్షేత్రాన్ని మింగేసిన వ్యక్తికి మళ్లీ సీటిచ్చారు. ఆదోనిలో వలసపక్షి ఉన్నారు. మంత్రాలయం, ఆదోని, గుంతకల్లులోనూ వీళ్లు షాడోలుగా ఉంటారు. యుద్ధాల్లో సామంతరాజును చంపేసి రాజ్యాన్ని పంచుకున్నట్లు వీళ్లు నాయకులను అణగదొక్కి దోచుకుంటున్నారు. సామాన్యుడు, కురబల కోసం రాజీ లేకుండా పోరాడిన నాగరాజును మా పార్టీ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాం.
మంత్రాలయంలో రాఘవేంద్రరెడ్డి అనే బోయ కులస్థుడిని నిలిపాం. పత్తికొండలో ఈడిగ వర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తి కుమారుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాం. భాజపా కూడా ఆదోని నుంచి బోయవర్గానికి చెందిన పార్థసారథికి టికెట్ ఇచ్చింది. కర్నూలులో వైశ్య, కోడుమూరులో ఎస్సీలకు ఇచ్చాం. వారందరి డీఎన్‌ఏలోనూ తెదేపా ఉంది’ అని వెల్లడించారు. ‘ఒంగోలు ఎంపీ మాగుంట కుటుంబం విలువలతో కూడిన రాజకీయం చేసింది. ఆయన ఆత్మగౌరవాన్ని వైకాపా దెబ్బతీసింది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని తీసుకొచ్చింది. చిత్తూరులో ఆయన పుష్ప 1, ఒంగోలులో పుష్ప 2. అలాంటి పుష్ప 2కు ఓటేస్తారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
‘మేము భాజపాతో పొత్తు పెట్టుకున్నామని సీఎం జగన్ ముస్లింలను రెచ్చగొడుతున్నారు. పార్లమెంటులో బిల్లులకు ఇంతకాలం మద్దతిచ్చి ఇప్పుడు నాటకాలాడుతున్నారు. ముస్లింల అభివృద్ధికి ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా?’ అని తెదేపా అధినేత సవాలు విసిరారు. ‘ఇవే నాకు చివరి ఎన్నికలు.. ఒక్క అవకాశం ఇవ్వండి. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. ఎన్నికల్లో ఏదైనా పొరపాటు జరిగితే నా శవాన్ని చూడాల్సి వస్తుంది..’ అని మార్కాపురం తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సభలో ఉద్వేగంగా అన్నారు. కార్యక్రమాల్లో కర్నూలు, ఒంగోలు లోక్‌సభ పార్టీ అభ్యర్థులు పంచలింగాల నాగరాజు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు బీవీ జయనాగేశ్వరరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, దామచర్ల జనార్దన్, అశోక్‌రెడ్డి, గూడూరి ఎరిక్షన్‌బాబు, గొట్టిపాటి లక్ష్మి, బాలవీరాంజనేయస్వామి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిగ్‌జాం తుపాను వచ్చి రైతులు నష్టపోతే వారిని ఆదుకోలేని దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రం బాపట్లలో ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘కరోనా సమయంలో లాక్‌డౌన్ పేరుతో అందరూ విశ్రాంతి తీసుకున్నారు. అన్నం పెట్టే రైతన్న మాత్రం నిరంతరం కష్టపడ్డారు. అలాంటి రైతుకు కష్టం వస్తే ఆదుకోలేని ఈ ముఖ్యమంత్రి వ్యవసాయం గురించి మాట్లాడటం విడ్డూరం. రైతులు పంటలు నష్టపోకూడదని నేను పట్టిసీమ కడితే సీఎం జగన్ అక్కసుతో ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాకుండా అడ్డుకున్నారు’ అని చంద్రబాబు వివరించారు. కోస్తా తీరంలో ఆక్వా సాగును ప్రోత్సహించడానికి రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్తు సరఫరా చేస్తానని హామీనిచ్చారు.
source : eenadu.net
Discussion about this post