రాష్ట్ర అటవీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం చేపట్టిన కదిరి నియోజకవర్గ పర్యటనకు స్పందన కరవైంది. కదిరి, తలుపుల, తనకల్లు, నల్లచెరువు, గాండ్లపెంట మండలాల్లో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో మహిళలు లేక సభలు వెలవెలబోయాయి. వేదికపైన ఉన్న నాయకులు వెళ్లవద్ద్దంటూ వారిస్తున్నా మహిళలు ఎవరూ వినిపించుకోకుండా ఇంటిదారిపట్టారు.
వైఎస్‌ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రాకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలు అందవని యానిమేటర్లు మహిళలను భయపెట్టి సభకు తరలించారు. అయినా పలుచోట్ల సభలకు వచ్చిన మహిళలు కొద్దిసేపట్లోనే వెళ్లిపోవడం గమనార్హం.
ప్రభుత్వ కార్యక్రమాలకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే డాక్టరు పీవీ సిద్ధారెడ్డి, ఆయన వర్గీయులు పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే లేకుండా పార్టీ నాయకులతో నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. గాండ్లపెంట ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రాక ఆలస్యం అవడంతో మహిళలు విసుగెత్తి ఇళ్లకు బయలుదేరారు. మహిళలు వెళ్లకుండా ఏపీఎం సూర్యనారాయణ, వెలుగు మహిళ లీడర్లు అడ్డుకొని సభలో కూర్చొబెట్టే ప్రయత్నం చేశారు.
source : eenadu.net
Discussion about this post