పొత్తులతో ఎన్నికల గోదారి ఈదాలన్న చంద్రబాబు ఎత్తుగడ టీడీపీ పుట్టి ముంచుతోంది. ఇప్పటికే మూడు గ్రూపులు ఆరు కుంపట్లుగా రచ్చ రచ్చగా ఉన్న టీడీపీ పరిస్థితి తాజాగా మిత్రపక్షాలు జనసేన, బీజేపీలకు సీట్ల కేటాయింపుతో పూర్తిగా రోడ్డున పడింది. చంద్రబాబు గురువారం తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించగానే భగ్గుమన్న టీడీపీ తమ్ముళ్లు అధినేతపై నిప్పులు చెరిగారు.
పార్టీ కోసం శ్రమించిన వారిని పక్కనపెట్టి డబ్బు మూటలతో దిగిన ప్యారాచూట్ నాయకులకు టికెట్లు కేటాయించారని మండిపడ్డారు. పార్టీకోసం పనిచేసిన వారిని పక్కనపెట్టి కేవలం డబ్బులకే ప్రాధాన్యత ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌పై దుమ్మెత్తిపోశారు. టికెట్ల కేటాయింపులో మరోసారి పునరాలోచించాలని లేనిపక్షంలో పార్టీని ఓడించేందుకైనా వెనుకాడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్లెక్సీలు చించివేసి ర్యాలీలు నిరసనలు తెలిపారు. కొందరు నాయకులు రాజీనామాలు చేశారు. చంద్రబాబు చేసిన మోసానికి ఆగ్రహించిన కార్యకర్తలు రోడ్లపై టైర్లను కాల్చి ఆందోళనలు నిర్వహించారు. మొత్తంగా టీడీపీ రెండో జాబితా ప్రకటించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది.
కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ ప్రకటించిన పది నిమిషాలకే అక్కడ టీడీపీలో అసమ్మతి అగ్గి రగిలింది. మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు టికెట్టు నిరాకరించడంపై ఆ పార్టీ వర్గాలు పిఠాపురంలో గురువారం తీవ్ర స్థాయి ఆందోళనకు దిగాయి. పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద వర్మ అనుచరులు, ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ జెండాలు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పత్రికలు తగులబెట్టారు.
వర్మకు టికెట్టు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి, రెబల్‌గా పోటీ చేయిస్తామని గతంలోనే వారు ప్రకటించారు. అధిష్టానం తన నిర్ణయం మార్చుకోపోతే టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, సానుకూల నిర్ణయం ప్రకటించేంత వరకూ టీడీపీ జెండాలు సైతం పట్టుకోబోమని ఇటీవల చెప్పారు. తామంతా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామంటూ సంతకాలు సేకరించారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రకటనతో భగ్గుమన్న టీడీపీ నేతలు చంద్రబాబును, పవన్ కళ్యాణ్‌ను తీవ్ర పదజాలంతో దూషించారు.
source : sakshi.com
Discussion about this post