రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా అధికారం చేపట్టిన తర్వాత బీసీలపై అనేక దాడులు జరిగాయని అందుకు కారణమైన ఏ ఒక్కరినీ వదలమని మాజీ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. ఆదివారం స్థానిక మండల కేంద్రంలో హిందూపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు రంగయ్య అధ్యక్షతన జరిగిన బీసీ సదస్సులో సునీత పాల్గొని మాట్లాడారు. ముందుగా ఆమెకు మండల ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ ప్రాంతంలో బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు, ఇబ్బందులను చూసి ఆ రోజు పరిటాల రవీంద్రని ఎన్టీఆర్ తెదేపాలోకి తీసుకొచ్చారన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఎంతో మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని వాటి కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళితే కొంతమంది పోలీస్ అధికారులు లంచం తీసుకుంటున్నారన్నారు. కురుబల గుడికట్టు పూజారి నాగరాజు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరులు అన్నదమ్ముల గొడవలను స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. బీసీ నేతలు పరంధామ యాదవ్, గంగుల కుంట రమణ, రవి, పోతులయ్య, ఓబుళపతి, వెంకటనారాయణ, శ్రీరామ్‌నాయక్, స్థానిక తెదేపా మంల కన్వీనర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post