‘జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక రోజు వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలంతే!’ అంటారు పెద్దలు. బహుశా! కుప్పం ప్రజలకు కూడా 35 ఏళ్ల తరవాత ఆ రోజు వచ్చినట్లుంది. దశాబ్దాలుగా తాము గెలిపిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని.. రెండేళ్ల కిందటిదాకా కనీసం సొంతిల్లు కూడా కట్టు కోలేదని వాళ్లకి అర్థమయింది. బ్రాంచ్ కెనాల్ ద్వారా నీళ్లు తెస్తానని ఇన్నాళ్లూ మోసపు మాటలు చెప్పారే తప్ప.. ఆ పనిని చేసి చూపించింది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని వాళ్లకు అనుభవంలోకి వచ్చింది. అందుకే రాబోయే ఎన్నికల్లో బాబుకు బైబై చెప్పేందుకు వాళ్లంతా సిద్ధమవటంతో.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ నక్కజిత్తుల నారా వారు తనను ఓడించక ముందే ఆ నియోజకవర్గానికి ‘బై’ చెప్పటానికి సిద్ధమయ్యారు.
‘‘35 ఏళ్లుగా మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తున్నారు. ఇక ఆయనకు రెస్ట్ ఇవ్వాలనిపిస్తోంది. అందుకే ఈ సారి ఇక్కడి నుంచి నేను పోటీ చేయాలనుకుంటున్నాను’’ అంటూ చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరి బుధవారం కుప్పంలో ఓ బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు. స్కిల్ కుంభకోణంలో వేల కోట్లు నేరుగా విత్‌డ్రా చేసుకుని మింగేసిన కేసులో ఈ మధ్య చంద్రబాబు నాయుడిని పోలీసులు అరెస్టు చేయటంతో ఆయన జైలుకు వెళ్లటం తెలిసిందే. అది జరిగిన 10–15 రోజుల తరవాత కూడా ఆయన జైలు జీవితాన్ని చూసి తట్టుకోలేక కొందరు మరణించారన్నది టీడీపీ–ఎల్లో మీడియా వ్యాఖ్యానం.
వారందరికీ సాయం చెయ్యడానికి నేరుగా నారా భువనేశ్వరి ఓ యాత్ర చేస్తున్నారు. ఆమేమీ రాజకీయ నాయకురాలు కాదు. దీంతో యాత్రలో భాగంగా ఎక్కడికి వెళ్లాలి? ఎవరెవరిని కలవాలి? ఎవరికి చెక్కులివ్వాలి? ఏమేం మాట్లాడాలి? అనేది మొత్తం స్క్రిప్టు ప్రకారమే చేస్తున్నారు. బుధవారం మాట్లాడిన మాటలు కూడా ఆ స్క్రిప్టులో భాగమే. కళ్లెదుట ఓటమి స్పష్టంగా కనిపిస్తుండడంతో ఏదో ఒక వంకతో అక్కడి నుంచి పోటీ చేయకుండా జారుకోవాలనేది బాబు పన్నాగమని, అందుకే భార్య చేత ఆ మాటలు మాట్లాడించారు తప్ప అవేమీ చమత్కారమో, యథాలాపమో కావని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.
source : sakshi.com
Discussion about this post