రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైకాపా కార్యకర్తల మూకుమ్మడి దాడికి సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఫొటోగ్రాఫర్‌పై దాడిని ఖండిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం ఎదుట వారు ఆందోళన చేపట్టారు. వారికి తెదేపా, జనసేన, సీపీఐ, పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసు హెడ్ క్వార్టర్స్ ప్రధాన ద్వారం ముందు నిరసనకు దిగారు. తెదేపా మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్యేలు పార్థసారథి, ప్రభాకర్‌చౌదరి తదితర నాయకులు ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సభా ప్రాంగణంలో ఫొటోగ్రాఫర్‌పై దాడి జరిగినా సీఎం జగన్ కనీసం ఖండించడం లేదన్నారు. పోలీసుల ఎదుట దాడి జరుగుతున్నా పట్టించుకోలేదని, దీనిపై ఎస్పీ ఆలోచించాలన్నారు. జగన్ ఆదేశాలతో దాడి జరిగినట్లు భావించాల్సి ఉందని, ఇది కచ్చితంగా హత్యా ప్రయత్నమేనని దుయ్యబట్టారు. దాడి కేసులో సీఎంను నిందితుడిగా చేర్చి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
source : eenadu.net
Discussion about this post