రాప్తాడు వద్ద జరిగే ‘ సిద్ధం’ సభకు ప్రైవేటు పాఠశాలల బస్సులను బలవంతంగా స్వాధీనం చేసుకొన్నారు. వైకాపాకు సంబంధించిన కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతాల నుంచి జనం తరలించేందుకు బస్సుల్ని తీసుకున్నారు. రవాణాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంపై ఒత్తిడి చేసి శనివారం సాయంత్రానికి బస్సులు పంపించాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల నుంచి 700 బస్సులు స్వాధీనం చేసుకొన్నారు. వాటిని జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు పంపించారు. శనివారం 2 గంటలకే బస్సులు పంపాల్సి ఉండటంతో పిల్లల్ని ఇళ్లకు ముందుగానే పంపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు వాయిస్ రికార్డు పంపి వారిని ఇళ్లకు పంపించేశారు.
వైకాపా రాజకీయ సభ నిర్వహణలో భాగంగా ప్రభుత్వ విద్యా సంస్థలు బస కేంద్రాలుగా మారాయి.ఎస్కేయూలోని గంగా వసతి గృహం పోలీసులు బసచేయడానికి కేటాయించారు. కొన్నేళ్లుగా ఆ వసతి గృహం మూతపడింది. వసతులు సక్రమంగా లేక చాలామంది పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాప్తాడులోని రెండు ప్రభుత్వ పాఠశాలలు, ఎల్‌ఆర్‌జీ పాఠశాలలోని ఆడిటోరియం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థులతో ఉండాల్సిన రాప్తాడు పాఠశాల పోలీసులతో నిండిపోయింది. రాప్తాడు ప్రాథమిక పాఠశాలకు ఒకరోజు ముందుగానే చెప్పడంతో విద్యార్థులు ఎవరూ హాజరు కాలేదు. అక్కడే పోలీసులకు వంట వండేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాత్రం ఏ సమాచారం ఇవ్వలేదు. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వతరగతి వరకు 450 మంది వరకు విద్యార్థులు ఉంటారు. విద్యార్థులు యథాతథంగా పాఠశాలకు చేరుకున్నారు. అప్పటికే పాఠశాల ప్రాంగణం అంతా పోలీసులతో నిండిపోయింది. పాఠశాలకు సెలవు ఇవ్వాలని సీఐ ప్రధానోపాధ్యాయుడు నరసింహులును కోరారు. డీఈఓ నుంచి తమకు ఆదేశాలు లేవని స్పష్టం చేశారు. డీఈఓకు సమాచారం అందివ్వడంతో సెలవు ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులకు ఉన్నఫళంగా సెలవు ప్రకటించారు. ఉన్నట్లుండి సెలవు ఇస్తే ఎలాగని కనీసం మాకు మధ్యాహ్న భోజనం పెట్టి పంపాలని కోరారు. చేసేది లేక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టి సెలవు ప్రకటించారు. ఎండలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post