ప్రజా సంక్షేమమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అజెండా అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని చెప్పారు. మంగళవారం నగరంలోని 49వ డివిజన్‌లో ప్రజల మధ్య ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులతో కలిసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ జెండా ఎగురవేసి వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ ముందుగా పార్టీ శ్రేణులు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ ఆవిర్భవించి 13 ఏళ్లు పూర్తయిందని, వైఎస్ జగన్‌కు వెన్నంటి ఉన్న అందరికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్‌ఆర్ ఆశయ సాధన కోసం ఆవిర్భవించిన వైసీపీ.. గడిచిన 58 నెలల కాలంలో రాష్ట్రంలో సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, కానీ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎవరూ అమలు చేయలేదని అన్నారు. మరోసారి ఎన్నికలకు వెళ్తున్నామని, వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు అందుతాయన్న విషయాన్ని అందరికీ తెలియజేయాలని పార్టీ శ్రేణులకు తెలియజేశారు. భవిష్యత్ తరాలకు మంచి జరగాలంటే అది జగన్‌తోనే సాధ్యమని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మరోసారి జగన్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Discussion about this post