ప్రజలే సారథులై చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ సూచించారు. మహిళలకు గౌరవం దక్కాలన్నా, సామాజిక న్యాయం అందాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులకు న్యాయం జరగాలన్నా.. రాష్ట్రంలో రాజకీయ మార్పు ఎంతో అవసరమని చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబుపై విక్రమ్ పూల రాసిన ‘మహా స్వాప్నికుడు’ పుస్తకాన్ని జస్టిస్ గోపాలగౌడ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మాలాంటి వాళ్లు మాట్లాడాలి. వారిని సరైన దారిలో నడిపించాలి. అందుకే మాట్లాడుతున్నా. మహిళలకు సమానత్వం కల్పించిన చరిత్ర, వారిని గౌరవించే గుణం చంద్రబాబుకు ఉంది. ఏపీ రాజకీయాలకే ఆయన పరిమితం కాదు. దేశ భవిష్యత్తుకూ చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరం’ అని పేర్కొన్నారు. ‘చంద్రబాబు దేశానికి నాయకుడు.. ఎలాగంటే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా, దేవెగౌడ, గుజ్రాల్, వాజపేయీలను ప్రధానులుగా చేయించిన ఘనత ఆయనకుంది. దళితుడైన బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌ను చేశారు. దేశ రాజకీయాల్లో ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఉంది..’ అని పేర్కొన్నారు.
జైల్లో ఉంటే ఐటీ ఉద్యోగులు తరలివచ్చారు..
‘చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఐటీ ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చి నిరసన గళం వినిపించారు. ఆయన బిల్‌క్లింటన్, బిల్‌గేట్స్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ప్రపంచ పటంలో సైబరాబాద్‌కు స్థానం కల్పించారు. దేశ ప్రజలు దీన్ని మర్చిపోకూడదు. మహా స్వాప్నికుడు పేరు చంద్రబాబుకు సరిపోతుంది. ఒడిశాలో వరదలు వచ్చినప్పుడు సాయం చేసి మానవతావాదిగా నిలిచారు. ధర్మం గెలవాలి. ప్రజలకు మంచి జరగాలి. మహిళలు బాగుండాలని కోరుకుంటున్నా’ అని జస్టిస్ గోపాలగౌడ ఆకాంక్షించారు. ‘రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి బాగోలేదు. నిరుద్యోగ సమస్య ఉంది. రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు.. వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అని వివరించారు.
source : eenadu.net
Discussion about this post