‘ఎవరైనా తమ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి చేస్తాం, అభివృద్ధి చేస్తాం అని చెబుతారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం తాము అధికారంలోకి వస్తే వెంటాడి చంపుతామని అంటున్నారు. ఎమ్మెల్యే అయిన నన్నే నరుకుతాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రజలకు మంచి చేస్తే చంపుతామంటారా? అని ప్రశ్నించారు. సోమవారం ఆత్మకూరులో ‘వైఎస్సార్ చేయూత’ మెగా చెక్కు, మహిళలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఫ్యాక్షన్‌కు మళ్లీ ఆజ్యం పోస్తున్నారన్నారు. ఓ టీడీపీ నాయకుడు ఏకంగా తననే అసభ్య పదజాలంతో బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడన్నారు. చంద్రబాబు గెలిచాక తనను, బండి రవిని వెంటాడి మరీ చంపుతామన్నారంటే వారు ఎంతటి దుర్మార్గులో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇటీవల గీతాంజలి అనే మహిళ తనకు ప్రభుత్వం స్థలంతో పాటు ఇంటిని మంజూరు చేసిందని ఆనందం వ్యక్తం చేస్తే, జీర్ణించుకోలేని టీడీపీ, జనసేన నాయకులు ఆమైపె సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి మనం ఓటు వేద్దామా అంటూ ప్రజలను ప్రశ్నించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తెలిపారు. సొంత డబ్బుతో అమ్మ డెయిరీ ఏర్పాటు చేసి మహిళలకు అంకితం చేశానన్నారు. పేదలకు 17 వేల ఇళ్లు మంజూరు చేయించడంతో పాటు రైతులకు ఉచితంగా బోర్లు వేయించానన్నారు. 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్న పరిటాల సునీత చేయలేని సంక్షేమాభివృద్ధి చేసి చూపించామన్నారు. ఎమ్మెల్యే అయిన ఏడాదికే పేరూరు డ్యాంకు నీరు తీసుకువచ్చామన్నారు. రూ.154 కోట్లతో నీటి సమస్య పరిష్కారానికి కృషి చేశామన్నారు. రామగిరి మండలానికి రూ.1,500 కోట్లతో 300 మెగావాట్ల సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చామన్నారు. అనంతరం మహిళలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2,06,030 మంది పిల్లలకు బాలల బీమా కింద ఎమ్మెల్యే రూ.1.15 లక్షలు చెల్లించారు.
source : sakshi.com
Discussion about this post