మంత్రి పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి పీలేరును పీక్కుతింటున్నారని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారని, ఎదురుతిరిగితే కేసులు పెడుతున్నారని విమర్శించారు. పీలేరులో శనివారం నిర్వహించిన రా…కదలిరా బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పీలేరు, కలికిరి, గుర్రకొండ ప్రాంతాల్లో గనులు, భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. పీలేరు చుట్టుపక్కల 400 ఎకరాల భూములను కాజేయగా, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అడ్డుకున్నారని ప్రశంసించారు. రైల్వేకోడూరులో ముగ్గురాయిని దోచుకుంటున్న ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారన్నారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఇసుక, భూములను మింగేస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఆరుగురు వైకాపా ఎమ్మెల్యేలతోపాటు ఎంపీని ఓడించి వైకాపాను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. అంగళ్ల ఘటనను గుర్తుచేసుకున్న చంద్రబాబు ఈ రోజు.. రేపు.. ఎల్లుండి ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డిని ఉద్దేశిస్తూ హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులే కాదు తానూ వైకాపా బాధితుడినేనన్నారు. టమాట రైతులను ఆదుకుంటామని, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. యువకులందరూ రానున్న 74 రోజులపాటు సైకిళ్లపై తిరుగుతూ ప్రజలను చైతన్యపరచాలని, మీ భవిష్యత్తును పార్టీ చూసుకుంటుందని కితాబిచ్చారు.
source : eenadu.net
Discussion about this post