కులం లేదు.. మతం లేదు.. సామాజిక సమన్యాయం అసలే లేదు. అక్కడంతా పెత్తందార్లు చెప్పిందే తెలుగుదేశం పార్టీ అధిష్టానం వింటోంది. గత మూడు దశాబ్దాలుగా హిందూపురం పార్లమెంటులో ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. పరిటాల రవీంద్ర.. తర్వాత సునీత.. అనంతరం వారి తనయుడు శ్రీరామ్.. ఇలా ఆ కుటుంబం అనుమతి పొందిన వారికే టీడీపీ పెద్దలు టికెట్లు ఇస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుల రాజకీయం చేస్తూ.. పరిటాల కుటుంబానికే జిల్లాలో అధికంగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి కూడా ఇదే తీరులో అధిష్టానం పరిటాలకు పరోక్షంగా పగ్గాలు ఇస్తుందా? లేక సొంత నిర్ణయాలతో.. అభ్యర్థులను బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేస్తోందా? అనేది ఉత్కంఠగా మారింది. పరిటాల నాయకత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలను రాజకీయంగా ఎదగకుండా అణచివేతకు గురయ్యారు. మూడు దశాబ్దాలుగా జిల్లా టీడీపీలో ఇదే ధోరణి కొనసాగుతోంది. ఫలితంగా పార్టీ వైఖరి నచ్చక చాలామంది టీడీపీ వీడారు. అయినా అధిష్టాన ధోరణి మాత్రం మారడం లేదు.
హిందూపురం పార్లమెంటు పరిధిలో 2004 నుంచి ఎన్నికలను పరిశీలిస్తే.. కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన మహిళలకు మాత్రమే అసెంబ్లీ టికెట్లు ఇచ్చారు. అందులో ధర్మవరం నుంచి 2004లో గోనుగుంట్ల జయమ్మ ఉన్నారు. మరో మహిళ పరిటాల సునీత కావడం విశేషం. పరిటాల సునీత 2006 పెనుకొండ ఉప ఎన్నిక బరిలో దిగారు. ఆ తర్వాత 2009, 2014లో రాప్తాడు నుంచి పోటీ చేశారు. హిందూపురం పార్లమెంటు పరిధిలో టీడీపీ తరపున గత నాలుగు పర్యాయాల్లో పోటీ చేసిన మహిళలు కూడా వీరిద్దరే. 2019 ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో ఒక్క మహిళకు కూడా టీడీపీ అవకాశం ఇవ్వలేదు. ఈసారి కూడా ఇప్పటి వరకు ఎవరినీ ప్రకటించకపోవడం గమనార్హం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎంతో గౌరవం లభిస్తోంది. హిందూపురం పార్లమెంటు సమన్వయకర్తగా శాంతమ్మ, హిందూపురం, పెనుకొండ సమన్వయకర్తలుగా దీపిక, ఉషశ్రీచరణ్‌లకు అవకాశం ఇచ్చి బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారు. రానున్న ఎన్నికల్లో ఒకే పార్లమెంటు పరిధిలో వెనుకబడిన వర్గాలకు చెందిన ముగ్గురు మహిళలకు అవకాశం రావడం ఇదే తొలిసారి. బీసీ లంటే బ్యాక్‌వర్డ్ కాదు.. బ్యాక్‌బోన్ అని నమ్మిన వైఎస్ జగన్ ఆ దిశగా వారిని నడిపిస్తున్నారని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పెనుకొండ నియోజకవర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మంగమ్మ ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
source : sakshi.com
Discussion about this post