అటుపక్క సామాజిక పింఛన్లను అడ్డుకోవడం.. ఇటుపక్క సకాలంలో ఇచ్చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం! ఇదీ చంద్రబాబు రెండు నాలుకల వైఖరి! స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయాలు, పేదల నోట్లో మట్టి కొట్టే ఆలోచనలు తనకు మినహా మరెవరికీ ఉండవని మరోసారి రుజువు చేసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం నియమించిన వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇంటివద్దే పింఛన్లు అందిస్తూ పాలనను ప్రతి గడపకూ చేరువ చేశారు.
దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ తీసుకొచ్చిన ఈ వ్యవస్థపై చంద్రబాబు వేయని నింద లేదు, చేయని ఆరోపణ లేదు. వివక్ష, లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా పేదలు పారదర్శకంగా లబ్ధి పొందడం టీడీపీకి, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది. చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్ పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా నిత్యం అభాండాలు వేయడమే పనిగా వ్యవహరించారు.
వలంటీర్లు రాత్రిళ్లు వెళ్లి తలుపులు కొడుతున్నారని, వారి వల్ల ఆడపిల్లలకు రక్షణ లేదని, ఆ వ్యవస్థను రద్దు చేయాలని కుట్రపూరిత ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్రంలో వేలమంది యువతులు కనిపించకుండా పోయారని, అందుకు వలంటీర్లే కారణమంటూ దారుణంగా మాట్లాడారు. ఇలా అడుగడుగునా విపక్షం వేధించి అవమానించినా వలంటీర్లు పేదల సంక్షేమమే లక్ష్యంగా సేవాభావంతో విధులు నిర్వహించారు.
source : sakshi.com
Discussion about this post