ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న పాత్రికేయులపై వైకాపా శ్రేణులు దాడి చేయడం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నియంతృత్వానికి నిదర్శనమని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం పెద్దపప్పూరులో నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి జేసీ అస్మిత్‌రెడ్డితో కలసి ఆయన యువ చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. మండల వ్యాప్తంగా తెదేపా శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నీరాజనం పలికారు. మొదట అశ్వర్థ ఆలయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి రోడ్‌షోను ప్రారంభించారు. తెదేపా, జనసేన శ్రేణుల ఉత్సాహం, యువత కేరింతల మధ్య ఊరేగింపు కొనసాగింది. అడుగడుగునా మహిళలు మంగళహారతులు పడుతూ జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేసీ మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా అరాచక విధానాల వల్ల పాత్రికేయులపై ముఖ్యమంత్రి కళ్లెదుటే వైకాపా గుండాలు దాడులకు తెగబడుతున్నా రక్షణ కరవైందన్నారు. సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ అస్మిత్‌రెడ్డి మాట్లాడుతూ అరాచక పాలనతో సిద్ధం అంటున్న వైకాపాను ఎదుర్కోవడానికి సై అని సవాల్ విసిరారు.
source : eenadu.net
Discussion about this post