కొలువులు అన్నారు.. క్యాలెండర్ అన్నారు.. ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పిన మాటలను నమ్మిన నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు.. కాదు కాదు.. ఓ యుద్ధమే చేశారు.
కొలువు కాదు కదా.. ప్రకటన జారీ కోసమే కళ్లు కాయలుకాసేలా వేచి చూశారు. అయితే, జగన్ చెప్పిందంతా అబద్ధమే అని తెలుసుకుని నిరుద్యోగులు తీవ్ర నిరాశలో మునిగి పోయారు.
అదిగో ఉద్యోగ ప్రకటన.. ఇవిగో కొలువులు.. అంటూ నిరుద్యోగులను ఊరించిన జగన్.. వారిని నిట్టనిలువునా ముంచేశారు. ప్రతిపక్ష నేతగా ఎన్నికల ప్రచారాల్లో ఉద్యోగ నియామకాలంటూ హామీలిచ్చి.. అధికారం చేపట్టాక వాటిని బంగాళాఖాతంలో కలిపేశారు. ఏటా జాబ్ క్యాలెండర్‌ను అటకెక్కించేశారు. ఉద్యోగ నియామకాలను మడత పెట్టేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అధికారంలోకి రాగానే వాటిని భర్తీ చేస్తామని గత ఎన్నికలకు ముందు జగన్ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే వాటిని గాలికొదిలేశారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలతో సంబంధం లేకుండానే గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ నియామకాలను కూడా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలతో ముడిపెడుతూ నిరుద్యోగులను మోసపుచ్చారు. మెగా డీఎస్సీ అంటూ ఆర్భాటంగా చెప్పిన సీఎం.. కేవలం 6,100 పోస్టులకే ఇటీవల ప్రకటన ఇచ్చి పచ్చిదగా చేశారు. పరీక్షకు కూడా సన్నద్ధమయ్యేందుకు సమయం కూడా ఇవ్వకుండా అభ్యర్థులను ముప్పుతిప్పలకు గురిచేస్తున్నారు. ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రకటనకూ దిక్కులేకుండా పోయింది. ఇప్పటివరకు 4,100 ఎస్సై ఉద్యోగాలు మినహా ఆ శాఖలోని ఇతర ఖాళీలను భర్తీ చేసిన పాపానపోలేదు జగన్ సర్కార్. కడప ఉక్కు కర్మాగారాన్ని మూడేళ్లలో పూర్తిచేసి, 10 వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మరో మోసం చేశారు. సర్కారు కొలువులు ఇవ్వకుండా నిరుద్యోగుల పీక నొక్కేశారు!
2,210 పోస్టుల భర్తీకి 33 నోటిఫికేషన్లు!
జగన్ సర్కారు ఈ ఐదేళ్లలో ఒకే ఒక్కసారి.. 2021 జూన్ 18న జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. దాన్ని అమలుచేయడంలోనూ విఫలమైంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నుంచి ఇప్పటివరకు 2,210 పోస్టుల భర్తీకి 33 నోటిఫికేషన్లు ఇచ్చారు. అందులోనూ దాదాపు సగం గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పోస్టులే కావడం గమనార్హం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఖాళీల వివరాలు రానిదే పూర్తిస్థాయి నోటిఫికేషన్లు ఎలా ఇస్తామన్నది తొలి నుంచీ ఏపీపీఎస్సీ చేస్తున్న వాదన.
పాఠశాల విద్యాశాఖలో 2,20,266 పోస్టులకుగాను 1,73,713 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ లెక్కన 46,553 ఖాళీలు ఉన్నాయి. ఉన్నత విద్యాశాఖలో 15,818 పోస్టులకు 5,193 మందే ఉన్నారు. ఆ శాఖలో ఖాళీల సంఖ్య 10,625. వ్యవసాయ సహకార శాఖలో 4,423, సాంఘిక సంక్షేమ శాఖలో 6438 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
28వేల ఖాళీలుంటే 6వేలకే నోటిఫికేషనా?
ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే, ఆ ఖాళీలను భర్తీచేస్తే వేతనాల కోసం రుణం తీసుకోవాల్సి వస్తుందేమోనన్న ఉద్దేశంతో నియామకాలనే తగ్గించేసింది ఘనత వహించిన జగన్ సర్కార్. కేవలం 6,100 పోస్టులకే ఉద్యోగ ప్రకటన జారీ చేసి ఇవే మొత్తం ఖాళీలు అంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. రాష్ట్రంలో 8,366 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని సాక్షాత్తూ విద్యాశాఖ మంత్రే శాసనమండలిలో ప్రకటించారు. జిల్లా, మండల పరిషత్తు, పురపాలక శాఖల పరిధిలోని ప్రభుత్వ బడుల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు వివరించారు. అంతలోనే మాట మార్చడం గమనార్హం.
విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పేవారు కూడా లేకుండాపోయారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో కలిపి 3,220 పోస్టుల భర్తీకి గతంలో ప్రకటన ఇచ్చారు. పోస్టుల హేతుబద్ధీకరణ, రిజర్వేషన్ రోస్టర్‌పై పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ప్రభుత్వం గత డిసెంబరులోనే రిప్లై కౌంటర్ వేయాల్సి ఉండేది. ఈ విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండిపోయినట్లు విమర్శలున్నాయి.
రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022లో ప్రకటన ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి కోర్టు కేసు అడ్డంకిగా ఉందంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తున్నారు. అసలు ఈ పోస్టులు ఇప్పట్లో భర్తీ అవుతాయా? లేదా? అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
source : eenadu.net
Discussion about this post