- ఎన్నికలలో కీలకం కానున్న యువ ఓటర్లు
- వికలాంగులు, వృద్ధుల ఓట్లూ ముఖ్యమే
సాధారణ ఎన్నికల్లోయువత ఓట్లు కీలకం కానున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల మందికి పైగా యువత తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎన్నికల కమిషన్ అందచేసిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 18 -19 సంవత్సరాల వయసు ఉన్న ఓటర్ల సంఖ్య 9,01,863. వీరంతా గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఓటు నమోదు చేసుకున్నారు. ఏప్రిల్ 15 వరకు ఓటరు నమోదుకు అవకాశం ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2019 ఎన్నికల తర్వాత 2020, 2021, 2022 లో ఓటర్లుగా నమోదైన కొత్త ఓటర్ల సంఖ్య మరో 5 లక్షల పైన ఉంది.. ప్రస్తుతం రాష్ట్రంలో 4,09,37,352 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో యువ ఓటర్ల శాతం అంటే కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్న వారి శాతం దాదాపు అయిదు శాతం (4.88). ఇక వీరితో పాటు శారీరక వైకల్యం ఉన్న ఓటర్లు 5,17,140. అలాగే 85 సంవత్సరాల వయసు పైబడి ఉన్న వారు మరో 2,12,237 మంది ఓటర్లుగా ఉన్నారు. ఎన్నికలలో వీరి ఓట్లు కూడా కీలకం కానున్నాయి.
ఉద్యోగ, ఉపాధితోనే యువ ఓట్లు
యువత ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధి అంశాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని భావిస్తున్నారు. . ఏ రాజకీయ పార్టీ అయితే ఈ రెండింటిపై వారికి భరోసా ఇవ్వగలదే వారి వైపు యువత మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ యువ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వైసిపి తో పాటు టిడిపి,జనసేన,బిజెపి కూటమి దృష్టి సారించనుంది. వికలాంగులు, వృద్ధులు కూడా ఓటర్లలో కీలకంగా ఉన్నారు. వీరిలో అత్యధికులు ప్రభుత్వంపైనే ఆధారపడాల్సిన స్థితి. దీంతో వీరికోసం ప్రకటించే పథకాలకు ప్రాధాన్యత లభించనుంది.
source : prajasakthi
Discussion about this post