కడపలో తెదేపా స్టిక్కర్లను ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా సమక్షంలోనే వైకాపా కార్యకర్తలు చించివేశారని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆదివారం రాత్రి 9 గంటలకు రెండో పట్టణ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భారీగా తెదేపా కార్యకర్తలు అక్కడి రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… ‘కడప 31వ డివిజన్‌లోని మోచంపేటకు చెందిన సయ్యద్ నాయబ్ తన ఇంటికి తెదేపా స్టిక్కర్ అతికించుకున్నారు.. ఆదివారం ఆ ప్రాంతానికి వచ్చిన ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, స్థానిక కార్పొరేటర్‌తో పాటు పలువురు వైకాపా నాయకులు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లి, ఇంటి గోడపై తెదేపా స్టిక్కర్‌ను చూశారు. నువ్వు తెదేపా స్టిక్కర్ అతికించుకుంటావా… నీకు ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తాను. నీ అంతు చూస్తాం’ అని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి భయాందోళనకు గురి చేశారని పేర్కొన్నారు. అంజాద్‌బాషాకు ఓటమి భయం పట్టుకుందని, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. స్టిక్కరును చించినంత మాత్రాన తెదేపా నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడరని చెప్పారు. మోచంపేటలో సుమారు 200 మీటర్ల వరకు ఉన్న స్టిక్కర్లను చించివేశారని ఆరోపించారు. ఈ ఘటన మొత్తం ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా సమక్షంలోనే జరిగిందని, ఆయనపై తక్షణం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సయ్యద్ నాయబ్ మాట్లాడుతూ… ఇంటికి తెదేపా స్టిక్కర్‌ను ఎందుకు అతికించుకున్నావని, భయాందోళనకు గురి చేసి చించివేశారని, తనకు ఏం జరిగినా డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఆయన అనుచరులే కారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు జమీల్, అఖిల్ తదితరులున్నారు.
source : eenadu.net
Discussion about this post