ఉరవకొండ పట్టణం డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉండే తెదేపా నాయకుడు మారెన్న కుటుంబానికి స్థానిక వైకాపా వర్గీయుల మధ్య కొంత కాలంగా పాతకక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు శ్రీనివాసులు తమ జీవాలను పట్టుకోవడానికి శుక్రవారం ఉదయం శివరామిరెడ్డి కాలనీకి వెళ్లాడు. అక్కడే గుంపుగా ఉన్న వైకాపా వర్గీయులు అతన్ని కవ్వించి.. అడ్డగించి ఒక్కసారిగా కట్టెలు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. అతనికి రక్తంవచ్చేలా గాయాలయ్యాయి. విషయం తెలుసుకుని తండ్రి మారెన్న అక్కడికి కారులో వెళ్లగా ఆయన మీద కూడా దాడికి పాల్పడి కారు అద్దాలు ధ్వంసం చేశారు. తోడుగా వెళ్లిన దివాకర్‌నూ కొట్టారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఉరవకొండ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. రెండు నెలల కిందట ఇదే స్థాయిలో శ్రీనివాసులుపై వైకాపా వర్గీయులు కత్తులతో దాడి చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు ఆరోపించారు. పోలీసులు చర్యలు తీసుకునేంత వరకు వైద్యం చేయించుకునేది లేదని గాయపడిన శ్రీనివాసులు పోలీస్‌స్టేషన్ ఎదుట పడుకున్నాడు. అతని సీఐ తిమ్మయ్య, కానిస్టేబుళ్లు బలవంతంగా వాహనంలో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. బాధిత కుటుంబం పోలీసు వాహనానికి అడ్డంగా పడుకుని అడ్డుకున్నారు. తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి గాయపడిన వారిని సీఐ ఆసుపత్రికి తరలించారు. వైకాపాకు చెందిన శ్రీకాంత్, లక్ష్మన్న మరికొంత మంది తమ కుటుంబంపై తరుచూ దాడులకు పాల్పడుతున్నారని తెదేపా నాయకుడు మారెన్న వాపోయారు. ఉదయం దాడి జరుగుతున్న సమయంలో సీఐకి ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. దాడి చేసిన వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
source : eenadu.net
Discussion about this post