ఆయన నివాసం పాతబస్తీ.. అక్కడే రాజకీయ అరంగేట్రం. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి గెలిచేందుకు నియోజకవర్గంలో నగరపాలక సంస్థ నిధులు ధారపోశారు. తమ అధినేత అనూహ్యంగా పక్క నియోజకవర్గానికి పంపారు. దాంతో తనది కాని నియోజకవర్గంలో గెలుపు కోసం అడ్డదారి పట్టారు. వాలంటీర్లకు తాయిలాలు.. సచివాలయ ఉద్యోగులకు బహుమతుల పేరుతో వల వేస్తున్నారు. తనకు అనుకూలురైన సిబ్బందిని కొత్త నియోజకవర్గానికి బదిలీ చేయించుకుంటున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో బహుమతుల పంట పండుతోంది. మాజీమంత్రి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గంలో అయితే తాయిలం.. లేదంటే బెదిరింపులకు దిగుతున్నారు.
పట్టుకోసం ప్రలోభాలు
సెంట్రల్ నియోజకవర్గంలో 2019లో మల్లాది విష్ణు కేవలం 25 ఓట్లతో తెదేపా అభ్యర్థి బొండా ఉమాపై విజయం సాధించారు. దాంతో ఈసారి వెలంపల్లికి ఆ స్థానం కేటాయించారు. మల్లాది అలకబూనడంతో.. 22మంది కార్పొరేటర్లు, ఇన్‌ఛార్జులకు గుడ్‌విల్‌గా భారీ మొత్తం ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. వాలంటీర్లకు రాత్రి విందు ఏర్పాటుచేసి బహుమతులుగా కుక్కర్లు అందజేశారు. సచివాలయ సిబ్బందికీ బహుమతులు అందించారు. పశ్చిమ నియోజకవర్గం నాయకులను తనవెంటే తిప్పుకొంటున్నారు. వారు వస్తే.. తాము రామని సెంట్రల్ నాయకులు భీష్మించారు. తన వారిని తనకు సహకరించకుండా తీసుకెళుతున్నారని పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆసిఫ్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు.
ఓట్ల వేటకు కొత్త ఎత్తులు
తాజాగా పశ్చిమ నియోజకవర్గం నుంచి ఓటర్లను బదిలీ చేయిస్తున్నారు. ఇప్పటికే దాదాపు వెయ్యి దరఖాస్తులు అందాయి. కనీసం 5వేలు చేర్పించాలనేది ప్రణాళిక. ఇటీవల పారిశుద్ధ్య విభాగానికి చెందిన 20 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లను పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్‌కు బదిలీ చేయించారు. ఇలా అన్ని విభాగాల్లోనూ బదిలీలు చేయిస్తున్నారు. సింగ్‌నగర్‌లో తన పార్టీ కార్యాలయం ప్రారంభించి దానికి వెంటనే రోడ్డు వేయించుకున్నారు. వాలంటీర్లకు తాయిలాలు ఇవ్వడం, నగదు పంపిణీపై తెదేపా ఫిర్యాదు మేరకు నగర పోలీసు కమిషనర్‌ను విచారణకు ఆదేశించారు. కేసు నమోదయింది. ఎంతవరకు చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
source : eenadu.net
Discussion about this post