రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయిన జగన్ సర్కారును పెకలించి వేసేందుకు, కేంద్రంలో మళ్లీ ఎన్డీయే సర్కారును తెచ్చేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకల్పం తీసుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అభిప్రాయపడ్డారు. పాలనను పక్కన పెట్టి.. అవినీతిలో నువ్వా, నేనా అన్నట్లు రాష్ట్ర మంత్రులు పోటీ పడుతున్నారని.. అయిదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే కూటమిని గెలిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పల్నాడు జిల్లా బొప్పూడిలో ఆదివారం లక్షల మందితో నిర్వహించిన ‘ప్రజాగళం’ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. దేశంలో ఎన్నికల షెడ్యూలు వెలువడగానే తాను ఏపీకి వచ్చానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. సభకు వచ్చిన జనాల్ని చూస్తే.. కూటమిపై అభిమానం, జగన్ ప్రభుత్వంపై కోపం కనిపిస్తున్నాయన్నారు. దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించే వారంతా ఎన్డీయే సర్కారుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ‘వైకాపా, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు కాదు, రెండూ ఒకటే. ఒకే కుటుంబం నుంచి వచ్చినవారు నాయకత్వం వహిస్తున్నారు’ అని అభివర్ణించారు. ‘వైకాపాపై ప్రజల మనసులో ఉన్న కోపాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించాలని చూస్తున్నారు. ప్రజలు వీటన్నింటినీ గమనించి ఓటు చీలకుండా ఎన్డీయేకు ఓటేయాలి’ అని విజ్ఞప్తి చేశారు.
రాబోయే అయిదేళ్లూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఎంతో కీలకమని మోదీ వివరించారు. ‘కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ సర్కారుతో పేదల సంక్షేమం, యువత, మహిళల సంక్షేమానికి పునాది వేస్తాం. రాష్ట్రంలో మౌలిక వసతులు మెరుగుపరుస్తాం. నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తాం. నీలి విప్లవానికి పునాది వేస్తాం’ అని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందే ఆంధ్రప్రదేశ్‌కు ఓటేస్తున్నామనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
source : eenadu.net
Discussion about this post