ఆంధ్రజ్యోతి పత్రిక ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైకాపా కార్యకర్తలు మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద జరిగిన సిద్ధం సభ కవరేజీ కోసం వెళ్లిన ఆయనపై దాడి చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణంలోనే పిడిగుద్దులు కురిపించారు. నువ్వు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల వాడివా.. అంటూ, గుర్తింపుకార్డు చూపించాలని పట్టుబట్టారు. ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఆయన వారి నుంచి తప్పించుకొని పరుగులు తీయగా వైకాపా జెండా కర్రలతో ముఖం మీద, వీపు మీద రక్తం వచ్చేలా కొట్టారు.
సమీపంలోనే పోలీసులు ఉన్నా చాలాసేపు పట్టించుకోలేదు. చివరకు ఓ పోలీసు అధికారి వచ్చి శ్రీకృష్ణను తన వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న శ్రీకృష్ణను తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, ధర్మవరం తెదేపా బాధ్యులు పరిటాల శ్రీరామ్, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, జర్నలిస్టు సంఘం నేత పయ్యావుల ప్రవీణ్ పరామర్శించారు. సోమవారం ఉదయం ఏపీయూడబ్ల్యుజె ఆధ్వర్యంలో నిరసన ఉంటుందని పయ్యావుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి షేక్ మహమ్మద్ అయూఫ్ తెలిపారు.
source : eenadu.net
Discussion about this post