స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది. మంగళవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. తొలుత ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ గత ఏడాది నవంబరు 28న ఈ కోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో సమావేశాలు, బహిరంగసభల్లో పాల్గొనడం మినహాయించి హైకోర్టు విధించిన మిగిలిన అన్ని షరతులనూ ప్రతివాది పాటించాలని చెప్పారని గుర్తుచేశారు. తర్వాత ప్రతివాది, ఆయన కుమారుడు బహిరంగసభల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న అధికారులపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారన్నారు.
ఈ వాదనలను చంద్రబాబు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తోసిపుచ్చారు. ప్రతివాది కుమారుడి వ్యాఖ్యలను ఈ కేసులోకి తీసుకురావడం సరికాదన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది రంజిత్‌కుమార్ నారా లోకేశ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల గురించి కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల గురించి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది రంజిత్‌కుమార్ జోక్యం చేసుకుంటూ మీరు కోర్టు షరతులను పాటించాలని చెప్పిన తర్వాత కూడా ప్రతివాది ఇలాంటి ప్రకటనలు చేయడం తగదన్నారు. అప్పుడు న్యాయమూర్తి స్పందిస్తూ చంద్రబాబు ఏవైనా ప్రకటనలు చేసి ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు రంజిత్‌కుమార్ స్పందిస్తూ ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలపైనా డిసెంబరు 16న ఐఏ నెం.263771/2023 దాఖలుచేసినట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అది కోర్టు రికార్డుల్లో కనిపించకపోవడంతో న్యాయమూర్తి కేసు విచారణను మే 7వ తేదీకి వాయిదావేశారు. తర్వాత చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థలూథ్రా జోక్యం చేసుకుంటూ ఈ కేసు గురించి ఏపీ ప్రభుత్వ ఏఏజీ మీడియా ముందు ఇష్టానుసారం మాట్లాడారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఈ కేసు విచారణకు పిలవగానే జస్టిస్ బేలా ఎం.త్రివేది కేసు దస్త్రాన్ని తన కంప్యూటర్‌లో చూడటానికి ప్రయత్నించగా అది కనిపించలేదు. దాంతో, ఎందుకు కనిపించలేదని కోర్టు సిబ్బందిని ప్రశ్నించారు. అందుకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది రంజిత్‌కుమార్ స్పందిస్తూ ఆ విషయంతో తమకేమీ సంబంధం లేదని నవ్వుతూ సమాధానమిచ్చారు. తర్వాత న్యాయమూర్తి స్పందిస్తూ మిగతా అన్ని కేసులూ కనిపిస్తున్నాయని, ఇదొక్కటే కనిపించలేదని, ఏదో జరిగిందని నవ్వుతూ వ్యాఖ్యానించారు. అందుకు చంద్రబాబు న్యాయవాది స్పందిస్తూ ‘కోర్టు దాన్ని తెరవాల్సిన అవసరం లేదు. అది దైవసంకేతం’ అని నవ్వుతూ అన్నారు.
source : eenadu.net
Discussion about this post